తెలంగాణలో
జడ్పీటీసీ, ఎంపీటీసీ
ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విశ్వం న్యూస్) : తెలంగాణలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు వేగవంతం చేసింది. మే నెలలో పోలింగ్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని, ఓటర్ల జాబితా నవీకరణకు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 566 జడ్పీటీసీ, 5,773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో రిజర్వేషన్ల ప్రకారం కొత్త జాబితాల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా ఓటర్లను గుర్తించి, సంబంధిత పంచాయతీలు మరియు పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు.
2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు నవీకరించిన ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రక్రియ కొనసాగనుంది. డేటాలో లోపాలు ఉంటే ఈ నెల 23లోపు నివేదించాలని సూచించారు. అనంతరం ముసాయిదా జాబితాను విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ప్రకటించనున్నారు.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధత చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పట్టణీకరణ కారణంగా కొన్ని గ్రామ పంచాయతీలు పురపాలికల్లో విలీనం కావడంతో ఈసారి స్థానాల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
గతంలో 2019 మేలో ఈ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించగా, ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లపై ఉన్న న్యాయపరమైన సమస్యలు తాజాగా పరిష్కారం కావడంతో ఎన్నికల మార్గం సుగమమైంది.
ఓటర్ల జాబితా ఖరారు కాగానే బ్యాలెట్ బాక్సుల సిద్ధం, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు వంటి చర్యలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. అధికార కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించాలని భావిస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా బలంగా పోటీకి సిద్ధమవుతున్నాయి.