తెలంగాణకు శత్రువులే మిత్రులయ్యారా? : ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్

హైదరాబాద్, జనవరి 7, 2026 (విశ్వం న్యూస్) : జాతీయ స్థాయిలో పరస్పరం విమర్శలు చేసుకునే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో మాత్రం ‘అక్రమ సంబంధం’ కొనసాగిస్తూ, కేసీఆర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీపై కలిసి విషప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్–బీజేపీల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.

బీజేపీ కార్యాలయంలో కూర్చుని మాజీ కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ రెడ్డి రేవంత్ రెడ్డికి మద్దతుగా పీపీటీలు ప్రదర్శించడాన్ని శ్రావణ్ తీవ్రంగా ఖండించారు. “వెదిరే శ్రీరామ్ తెలంగాణ బిడ్డవా? లేక రేవంత్ రెడ్డికి ఏజెంట్‌వా?” అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేయడం సరికాదని, జలసౌధలో మరియు ఇరిగేషన్ సమావేశాల్లో బీజేపీ నేతలకు ఏమి పని అని నిలదీశారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీయే బాధ్యమని ఆయన గుర్తుచేశారు. నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు కేవలం 299 టీఎంసీల కేటాయింపుతో తీరని నష్టం చేసిందన్నారు. కేసీఆర్ గారు 50:50 వాటా కోసం కేంద్రానికి 28 లేఖలు రాశారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవడంలో ఎన్జీటీ ముందు పోరాడి విజయం సాధించింది కూడా కేసీఆర్ గారేనని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా అంగీకరించారని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోందని ఆరోపించిన శ్రావణ్, రూ.100–200 కోట్లు ఖర్చు చేస్తే పిల్లర్ల మరమ్మతులు పూర్తవుతాయని, కానీ రేవంత్ సర్కార్ ప్రజల ఆస్తిని కాపాడకుండా ప్రాజెక్టును పడకేయాలనే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మిస్ వరల్డ్ పోటీలు, ఫుట్‌బాల్ ఈవెంట్లకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వంపై బీజేపీ మౌనం వహించడాన్ని ప్రశ్నించారు.

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ప్రగతిని గణాంకాలతో వివరించారు. 1956–2014 మధ్య 42.77 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉండగా, కేసీఆర్ పాలనలో అదనంగా 48.74 లక్షల ఎకరాలకు నీరందించామని తెలిపారు. ధాన్య ఉత్పత్తి 2014లో 68 లక్షల టన్నుల నుంచి 2023 నాటికి 2.70 కోట్ల టన్నులకు పెరిగిందని, కాళేశ్వరం వల్ల భూగర్భ జలాలు సగటున 5.36 మీటర్లు పెరిగాయని చెప్పారు. ఒకప్పుడు వలస వెళ్లిన పాలమూరు యువత నేడు తిరిగి వచ్చి ఇక్కడే ఉపాధి పొందుతోందని అన్నారు.

జూబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రాకపోవడం ప్రజల తీర్పేనని, కాంగ్రెస్‌కు అమ్ముడుపోయిన రాజకీయాలు ఇకనైనా మానాలని హెచ్చరించారు. ‘ఆర్ఆర్’ టాక్స్ దోపిడీని ప్రశ్నించాలని, అధికారం ఉందని ప్రతిపక్షంపై దాడులు చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డాక్టర్ దాసోజు శ్రావణ్ స్పష్టం చేశారు. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *