గొప్ప గొప్ప కవులు, కళాకారులకు
సాహితీవేత్తలకు వేదిక కరీంనగర్ జిల్లా

- పీవీ నరసింహారావు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, అలిశెట్టి ప్రభాకర్ లాంటి ఎందరో గొప్ప సాహితీవేత్తలు పుట్టిన గడ్డ కరీంనగర్
- జానపదానికి, ఉద్యమానికి పెట్టింది కరీంనగర్ జిల్లా
- తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు సాహితివేత్తలు ముఖ్య భూమిక పోషించారు
- 93 మంది కవులకు 1000 రూ.ల నగదు శాలువాతో సత్కారం
- కేంద్ర సాహిత్య అకాడమీ, జాతీయ స్థాయి పురస్కారాలు పొందిన 25 మంది సీనియర్ కవులకు 2000 రూ.ల నగదు శాలువాతో సత్కారం
- సాహితీవేత్తల భవనం కోసం 5గుంటలు భూమి కేటాయింపు 14న భూమి పూజ
- రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ బ్యూరో, జూన్ 11 (విశ్వం న్యూస్) : గొప్ప గొప్ప కవులు, కళాకారులు సాహితీవేత్తలకు వేదిక కరీంనగర్ జిల్లా అని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా సాహితీ సంస్థల సమైక్య సమన్వయంతో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన సాహిత్య దినోత్సవం కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొప్ప గొప్ప సాహితివేత్తలు కళాకారులు కవులకు వేదిక కరీంనగర్ జిల్లా అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు,సాహితీ వేత్తలు ముఖ్య భూమిక పోషించారని అన్నారు.అలాంటి కవులు,కళాకారులు, సాహితీవేత్తలను గౌరవించుకోవాలని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాహితీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

కరీంనగర్ జిల్లా కళాకారులకు వేదిక అని స్వర్గీయ పివీ నరసింహారావు, స్వర్గీయ డాక్టర్ సి.నారాయణరెడ్డి, అలిశెట్టి ప్రభాకర్ పుట్టిన గడ్డ అని, ఉద్యమాలకు, జనపదాలకు వేదిక కరీంనగర్ జిల్లా అన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన కాలేశ్వరం ప్రాజెక్టు ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ కాంతులు విరాజిల్లుతున్నాయని, గత ఐదు దశాబ్దాల సమైక్య పాలనలో ఈ ప్రాంత అభివృద్ధికి నాటి పాలకులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పక్కనే మానేరు జలాశయం ఉన్నా తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద యుద్ధాలు, గుంతల రోడ్లు, మా నీరు మాకే కావాలని ఎల్ఎండి వద్ద ధర్నాలు చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. గతంలో నగరంలో రోడ్లు డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడ్డ రోజులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయని, కరీంనగర్ అభివృద్ధి కోసం నిధులు కావాలని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అడిగితే వెకిలిగా నవ్వారే తప్ప ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.కరీంనగర్ అభివృద్ధిలో చెయ్యి ఇచ్చారే తప్ప చేయూతనివ్వలేదు అన్నారు.ఇక్కడి సంపదను వారి ప్రాంతానికి తరలించి అభివృద్ధి చేసుకున్నారే తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే మనస్సు వారికి రాలేదన్నారు. స్వయంపాలనలో కరీంనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం, సెంట్రల్ లైటింగ్ తో రాత్రివేళ కరీంనగరం జిగేల్ మంటుందని, మన నీరు మన బొగ్గు మన నిధులు మన సంపదతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని అన్నారు.

సర్వ మతాలకు వేదిక కరీంనగరం, అందరం కలిసి ప్రశాంత వాతావరణంలో జీవిస్తే కరీంనగరం మరింత అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని సూచించారు. మన బిడ్డల బంగారు భవిష్యత్ కోసం మాట్లాడుతున్నానని, ప్రపంచ స్థాయిలో కేబుల్ బ్రిడ్జ్, మానేర్ రివర్ ఫ్రంట్ లను నిర్మిస్తున్నాం, గతంలో దుర్గందాన్ని వేద జల్లిన మానేరు తీరం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారింది కేబుల్ బ్రిడ్జిని ఈనెల 21వ తేదీన ప్రారంభించనున్నట్లు,ఎం ఆర్ ఎఫ్ ను ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎంఆర్ఎఫ్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రపంచంలోనే మూడవదైన బిగ్ ఓ ఫౌంటెన్ ను నిర్మిస్తున్నామని, తెలంగాణ రాకపోతే ఈ అభివృద్ధి జరిగేదా అన్నారు.ఇప్పుడు తెలంగాణలో అన్ని మతాలవారు ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఇతర ప్రాంతాల వారు తెలంగాణకు రావడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
సీఎం కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగాలి దశాబ్ది ఉత్సవాలు సర్వ మతాల పండుగ అన్నారు. కవులు కళాకారులు సాహితి వేత్తలకు ఒక వేదిక ఉండాలని భవన నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయించామని తెలిపారు.ఈ నెల 14వ తేదీన భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ పురోగతిలో కవులు కళాకారులు సాహితీవేత్తలు మీ వంతు పాత్ర పోషించాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు చెందిన93 మందిర్ రచించిన కవితల సంకలనం ” పదేండ్ల పండగ” పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. 93 మంది కవులచే కవి సమ్మేళనం నిర్వహించి వెయ్యి రూపాయల నగదు, శాలువాతో సత్కారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ మరియు జాతీయ స్థాయి పురస్కారాలు పొందిన 25 మంది సీనియర్ కవులను 2000/- రూపాయల నగదు, అలువాతో సత్కరించడం జరిగింది.