కరీంనగర్ అంటేనేపోరాటాల గడ్డ
- తెలంగాణ మోడల్ కావాలో..
- గుజరాత్ మోడల్ కావాలో..
- ఛత్తీస్గఢ్ మోడల్ కావాలో ఆలోచించండి
- యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తాం. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటాం.
కరీంనగర్, మార్చి 9 (విశ్వం న్యూస్) : ‘కేసీఆర్ పదే పదే తెలంగాణ మోడల్ అంటున్నారు. తెలంగాణ మోడల్ అంటే తాగుబోతుల తెలంగాణనా? కేసీఆర్ వచ్చాక 3 వేల వైన్ షాపులు… 60 వేల బెల్టు షాపులు వచ్చాయి. కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా? కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూస్తే… పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే. గుజరాత్ మోడల్ కావాలో.. ఛత్తీస్గఢ్ మోడల్ కావాలో విజ్ఞులు ఆలోచించాలి. తెలంగాణ మోడల్ కావాలో.. ఛత్తీస్గఢ్ మోడల్ కావాలో ఆలోచన చేయండి. ఎవరి చేతిలో పెడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా గురువారం కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని పద్మా నగర్ బైపాస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కరీంనగర్ కవాతు పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతీ ప్రాంతంలో ఒక గొప్ప పవిత్ర స్థలం ఉంటుంది. కరీంనగర్ లో అలాంటి గొప్ప పవిత్ర స్థలం అంబేద్కర్ స్టేడియం 60 ఏళ్ల ఆకాంక్షను గౌరవించి 2004లో ఇదే గడ్డపై తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చారు. వేములవాడ, కొండగట్టు పుణ్య క్షేత్రాలకు ఎంత ప్రాధాన్యత ఉందో. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంకు అంతే ప్రాధాన్యత ఉంది. మాట తప్పక మడమ తిప్పక…. సోనియా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఇచ్చిన రాష్ట్రం ఇవాళ ఎవరిపాలైందో మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? తెలంగాణ ఉద్యమకారులకు, నిరుద్యోగులకు ఈ వేదికగా ప్రశ్నిస్తున్నా..ఇక్కడ ఎంపీలుగా గెలిచిన కేసీఆర్, తన కుటుంబం కరీంనగర్ కు ఏం చేశారు? పొన్నం ప్రభాకర్ ను గెలిపిస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. జైపాల్ రెడ్డి చొరవతో, వ్యూహంతో ఆనాడు తెలంగా రాష్ట్రం ఏర్పడింది. తల్లిని చంపి పిల్లను బ్రతికించారని మోదీ అవహేళన చేశారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని బీజేపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదు. ఇక్కడ గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తాం. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటాం.
ఆది శంకరాచార్య తర్వాత రాహుల్ గాంధీ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆది శంకరాచార్య తర్వాత దేశమంతా తిరిగిన వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే. విద్వేషాన్ని వీడి దేశ సమైక్యతను కాపాడాలని రాహుల్ సందేశం ఇచ్చారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు చూసి ఇక్కడి బీఆరెస్ ప్రభుత్వం సిగ్గుపడాలి. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. మేమంతా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నాం. రాష్ట్రంలో బీఆరేస్, బీజేపీ లను బొంద పెట్టాలి. ఛత్తీస్గఢ్ మాదిరిగా మద్దతు ధర ఇచ్చి వరి ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామన్న ప్రభుత్వం నిస్సిగ్గుగా ఆ హామీని గాలికొదిలేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు రూ. 3000 భృతి అందిస్తుంది.

కాంగ్రెస్ ది ఛత్తీస్గఢ్ మోడల్ : భూపేష్ భగేల్ – ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి
కరీంనగర్.. తెలంగాణ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణను ఎప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడు కరీంనగర్ గుర్తొస్తుంది. తెలంగాణ వచ్చినా రైతులు, నిరుద్యోగులకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు లభించలేదు. కేటీఆర్ ఎవరు.. ఆయనకు ఉపాధి వచ్చింది. లిక్కర్ క్వీన్ కవిత కు ఉపాధి లభించింది. దేశ సంపద ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్ళింది… ఇది బీజేపీది గుజరాత్ మోడల్. కుటుంబ పాలన బీఆరెస్ మోడల్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర కల్పించి… వారి జీవితాల్లో వెలుగులు నింపాం. కాంగ్రెస్ పార్టీది ఛత్తీస్గఢ్ మోడల్.. దేశంలోకెల్లా రైతులకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. తెలంగాణలోనూ ఛత్తీస్గఢ్ మోడల్ ను అమలు చేద్దాం. నిరంకుశ పాలన నుంచి.. పేదలు, రైతుల సంక్షేమాన్ని కోరే కొత్త తెలంగాణ ఏర్పాటు చేసుకోవాలి, అది మీ చేతుల్లోనే ఉంది.
సామాజిక తెలంగాణ ఏర్పడలేదు : మల్లు భట్టివిక్రమార్క
ఈ స్థలం చాలా చరిత్రాత్మక స్థలం. దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తీర్చేందుకు సోనియాగాంధీ ఇక్కడే మాట ఇచ్చారు. కరీంనగర్ అంటేనే పోరాటాల గడ్డ. తెలంగాణ వచ్చింది..కానీ నిధులు మాయమైపోయాయి. ఎక్కడా ప్రాజెక్టులు రాలేదు.. ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. ప్రాణహిత కు అంబేద్కర్ పేరును తొలగించారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులలో పారే నీటితోనే పంటలు పండుతున్నాయి. భూమి లేని నిరుపేదలకు రూ.7 వేలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇస్తోంది. కానీ ఇక్కడ బీఆరెస్ ప్రభుత్వం మాత్రం ఏమీ ఇవ్వడంలేదు. ఏమీ ఇవ్వని తెలంగాణలో రూ.5లక్షల కోట్ల అప్పు ఉంది. అన్ని ఇస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం అప్పు కేవలం రూ.83వేల 125 కోట్లు మాత్రమే. మనం తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యం నెరవేరలేదు.
బడుగు బలహీన వర్గాల కోసమే సోనియా తెలంగాణ ఇచ్చారు
మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. సోనియాగాంధీ ఈ స్టేడియంలోనే తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చారు. సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందాలనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేశారు. బడుగు బలహీన వర్గాలు ముందుకు తీసుకెళ్లేందుకే సోనియా తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలే. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ దొందూ దొందే. సోనియా కలలుగన్న సామాజిక తెలంగాణ ఏర్పడాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. అప్పుడే తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది.
ఛత్తీస్గఢ్ మోడల్ కావాలి : జైరాం రమేష్
గుజరాత్ మోడల్ లో ఒక క్రికెట్ స్టేడియం మాత్రమే కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ మోడల్ లో రైతుల జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి… అందుకే గుజరాత్ మోడల్ కాదు.. ఛత్తీస్గఢ్ మోడల్ లక్ష్యంగా పని చేయాలి. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నేతలంతా తెలంగాణ కావాలని ముక్త కంఠంతో కోరారు. అందరి కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాహుల్ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు బూస్టర్ డోస్ లా పనిచేసింది. కేసీఆర్ హఠావో… తెలంగాణ బచావో. కేసీఆర్ ను ఓడించి తెలంగాణను కాపాడుకోవాలి. చరిత్రలో తానీషా, నిజాం నిరంకుశ పాలన గురించి పుస్తకాల్లో చదివాం. కేసీఆర్ ఎనిమిదవ నిజాం లా వ్యవహరిస్తున్నాడు.
