- నగర పాలక సంస్థ చేస్తున్న నగర అభివృద్ధిలో అడుగడుగునా నిర్లక్ష్యం, అవివేకం
- మల్యాల సుజిత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కరీంనగర్
కరీంనగర్ బ్యూరో, జూన్ 7 (విశ్వం న్యూస్) : కరీంనగర్ నగరపాలక సంస్థ నగరంలోని పలు కాలనీల్లో, ఇన్నర్ రోడ్ల అభివృద్ధి చేస్తున్న తీరులో అడుగడుగునా నిర్లక్ష్యం, అవివేకం కనపడుతున్నాయని దీనివల్ల ప్రజాధనం వృధా అవడమే కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్.
నగరవ్యాప్తంగా గత తొమ్మిదేండ్లలో ప్రధానరోడ్లని వేస్తూ తవ్వుతూ మళ్ళీ వేస్తూ నిత్యం వాహనదారులకు పాదచారులకు నరకం చూపిస్తున్నారని, బాగా ఉన్న రోడ్లపై మళ్ళీ ఎందుకు రోడ్లు వేస్తున్నారో తెలియడం లేదని ఇందులో ప్రజాధనం అవినీతికి గురవుతున్నట్లు అనిపిస్తోంది అని ఆరోపించారు. కొన్ని మార్గాల్లో ఉన్న రోడ్ పైనే తిరిగి వేయడం వల్ల పక్కన ఉండే పరిసరాలు కిందకు పోతున్నాయని, దశాబ్దాల క్రితం కట్టుకున్న కాలనీలు, ఇండ్లు, వ్యాపార సముదాయాలు ముంపుకి గురయ్యేలా అధికారుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు సుజిత్ కుమార్.
పలు కాలనీల్లో ఒకేసారి ఉన్న రోడ్లని మొత్తం తవ్వివేసి ఆ కాలనీలోకి వాహనాలు రాకుండా చేస్తున్న పనులు చూస్తుంటే, ఇండ్ల ముందు ఉండే రోడ్ కనెక్టివిటీ ని తవ్వేసి ప్రత్యామ్న్యాయం చూపించకుండా ఆ ఇండ్లల్లో నివాసముండే వాళ్ళు వాహనాలు వాడుకోవడానికి నెలల తరబడి అవకాశం లేకుండా చేస్తున్న చర్యలు చూస్తుంటే నగరపాలక సంస్థ ప్రజలకోసముందా లేక కాంట్రాక్టర్ ల కోసముందా అనే అనుమానం కలుగుతోందన్నారు.
నగరపాలక సంస్థ నిర్లక్ష్య వైఖరికి ప్రమాదాలకు గురవుతూ కొంతమంది ఆసుపత్రుల పాలు అవుతున్న సంఘటనలు కూడా నగరంలో ఉన్నాయని కొంతమంది వృద్ధులు తిరిగి కోలుకోక ప్రాణాలు వదిలిన సంఘటనని చూశామని విచారం వ్యక్తం చేశారు. గతంలో కూడా నగర అభివృద్ధి అన్ని శాఖల సమన్వయంతో పక్కా ప్రణాళికతో ప్రజాధనం వృధాకాకుండా, ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేపట్టాలని నగరపాలక సంస్థకు విన్నవించడం జరిగిందని అయినా పాలకులు అధికారులు ఇష్టారీతిలో వ్యవహరిస్తూ సమస్యలని సృష్టిస్తున్నారని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని అన్నారు మల్యాల సుజిత్ కుమార్.