నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఖమ్మం సభ : మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 16 (విశ్వం న్యూస్) : ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభను నభూతో భవిష్యత్ అన్నట్లుగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో కేసీఆర్ కరీంనగర్‌లో సింహగర్జన నిర్వహించారని, బీఆర్‌ఎస్ తొలిసభ ఖమ్మంలో నిర్వహించడం సంతోషకరమన్నారు. జాతీయ పార్టీల నాయకులు పాల్గొనే ఖమ్మం సభ దేశ రాజకీయాలను మలుపుతిప్పే సభగా నిలిచిపోతుందన్నారు. మలి దశ ఉద్యమంలో ఖమ్మం ప్రజల పోరాటం, వారి భాగస్వామ్యం మరువలేనిదని, అందుకే ఇక్కడి నుంచే బీఆర్ఎస్ కు శంఖారావం పూరిస్తున్నామన్నారు. వంద ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని తయారు చేశామని పేర్కొన్నారు.
పార్కింగ్‌ను 448 ఎకరాల్లో ఏర్పాటు చేశామని, 20 పార్కింగ్ స్థలాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. సభలో వేయి మంది వలంటీర్లు పాల్గొంటారని, ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల వారీగా జనసమీకరణ జరుగుతున్నదన్నారు. ఇందులో ఎక్కువగా ఖమ్మం చుట్టుపక్కల 13 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేపట్టనున్నట్లు తెలిపిపారు. మహబూబాబాద్, సూర్యాపేట నుంచి కూడా అత్యధికంగా జనం వస్తున్నారన్నారు. ఖమ్మం చరిత్రలోనే పెద్ద ఎత్తున జనసమీకరణ జరుగుతోందని, కేసీఆర్‌ను దీవించేందుకు సభకు తరలిరావాలని జనం ఉబలాటపడుతున్నారన్నారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో జనం తరలిస్తున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఖమ్మం సభకు బస్సులను సమకూరుస్తున్నామన్నారు.