- వివరాలు వెల్లడించిన పోలీసులు
- రూ.25 లక్షల సుపారీ ఇచ్చి మరీ హత్య
Realtor Kammari Krishna Murder Case Update : రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సంచలనం సృష్టించిన కమ్మరి కృష్ణ హత్యకేసు చిక్కుముడి వీడింది. రియల్టర్ కృష్ణను అతడి మొదటి భార్య కుమారుడే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఆస్తి విషయమై ఈ దారుణానికి ఒడిగట్టాడని, రూ. 25 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురితో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.
హైదరాబాద్, జూలై 13 (విశ్వం న్యూస్) : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో సంచలనం రేపిన కమ్మరి కృష్ణ హత్యకేసులో చిక్కుముడి వీడింది. అతడిని చంపింది మొదటి భార్య కొడుకేనని పోలీసులు నిర్థారించారు. రియల్టర్ కమ్మరి కృష్ణ.. తన ఆస్తినంతటినీ మూడో భార్యకు రాసిస్తున్నాడన్న కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. ఒక గ్యాంగ్ కు రూ. 25 లక్షల సుపారీ ఇచ్చి.. తండ్రిని హత్య చేయించాడు. హత్య చేసిన నిందితుల నుంచి 3 కత్తులు, 2 కార్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండలం హైదర్ షా కోట్ కు చెందిన కమ్మరి కృష్ణ (55) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. అతనికి షాద్ నగర్ పరిధిలోని కమ్మదనంలో ఒక ఫాం హౌస్ ఉంది. జూలై 10న కృష్ణ మూడవ భార్య అయిన పావనితో కలిసి ఆ ఫామ్ హౌస్ కు వెళ్లాడు. అప్పటికే అతడిని హత్య చేసేందుకు ఎదురుచూస్తున్న.. కృష్ణ పర్సనల్ సహాయకుడైన బాబా, మరో ఇద్దరు చాకుతో గొంతుకోసి వెళ్లిపోయారు.
కృష్ణ అరుపులు వినిపించగా.. పై అంతస్తులో ఉన్న భార్య పావని హుటాహుటిన కిందికి వచ్చి.. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ.. అప్పటికే కృష్ణ మరణించాడు. కాగా.. బాబా గతేడాదే కృష్ణ వద్ద పనిమానేశాడు. కృష్ణ ఫాం హౌస్ కు వెళ్లిన విషయం తెలుసుకుని.. అక్కడికి వెళ్లాడు. కాసేపటికి మరో ఇద్దరు అక్కడికి రాగా.. ముగ్గురూ కలిసి కృష్ణను హత్యచేశారు. ముగ్గురు భార్యలున్న కృష్ణకు.. ఆస్తి తగాదాలున్నాయి.
మొదటి భార్యకు ఇద్దరు కొడుకులుండగా.. మూడో భార్య కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు 4 రోజుల క్రితమే జరిగాయి. కృష్ణ మొత్తం ఆస్తిని మూడో భార్య పేరిట రాస్తుండటంతో కక్ష గట్టిన మొదటి భార్య కొడుకు కమ్మరి శివ.. ప్లాన్ ప్రకారం కృష్ణను హత్య చేయించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి.. అతడిని అరెస్ట్ చేశారు.