ఈ నెల 17న కొడకండ్లకు
మంత్రి కేటీఆర్ రాక!
- కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్
- ఆగస్టు నుంచి వరంగల్ టెక్స్టైల్ పార్కులో ఉద్యోగావకాశాలు
- హైదరాబాదులోని సచివాలయంలో ఉన్నతాధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్, జూన్ 12 (విశ్వం న్యూస్) : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపనకు తేదీ ఖరారు అయింది. ఈనెల 17వ తేదీన ఐటి, పరిశ్రమలు, చేనేత, పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖల మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు మంత్రి కేటీఆర్ తో చర్చించి ఆయన సమయం తీసుకున్నారు. అనంతరం మంత్రి ఆయా శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాదు నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో సమావేశమై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్ల చుట్టుముట్టు ప్రాంతాల వారికి ఉపాధి కల్పించే విధంగా కొడకండ్లలో సిరిసిల్ల తరహాలో టెక్స్టైల్ పార్క్ ని ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించాం. సీఎం కేసీఆర్ గారు, మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వారు అందుకు అవసరమైన అనుమతులు ఇచ్చారు. తదనుగుణంగా కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కుకు సరిపడా స్థలాన్ని సేకరించడం జరిగింది. అట్టి స్థలంలో సిరిసిల్ల మోడల్ లో టెక్స్ట్ టైల్ పార్కు ఏర్పాటు చేసి ఇక్కడి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని సంకల్పించారు. ఇప్పుడు కొడకండ్ల మినీ టెక్స్ట్ టైల్ పార్కు శంకుస్థాపనకు తేదీ కూడా ఖరారు కావడంతో తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
కొడకండ్ల లో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో ఇక్కడి ప్రజల కష్టాలు తీరనున్నాయి. వలస వెళ్లే ఇక్కడి ప్రాంతాల ప్రజలు తిరిగివచ్చే అవకాశం. వేలాది మందికి ఉపాధి దొరికే అవకాశం. కొడకండ్ల ప్రాంత అభివృద్ధికి అవకాశం. ఇక్కడి చేనేత కార్మికులకే కాక, చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఇతర వర్గాల ప్రజలకు కూడా ఉపాధి లభిస్తుంది. మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో కొడకండ్ల రూపు రేఖలు మారరున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆగస్టు నుంచి వరంగల్ టెక్స్టైల్ పార్కులో ఉద్యోగావకాశాలు
ఇదిలా ఉండగా వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో పాలకుర్తి నియోజకవర్గంకు చెందిన, ఇటీవలే కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉపాధి అవకాశాలను వచ్చే ఆగస్టు నెల నుంచి కల్పించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు హైదరాబాదులో జరిగిన సమీక్ష సమావేశంలో వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు కు చెందిన పలువురు ప్రతినిధులతో చర్చించామని మంత్రి తెలిపారు. ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో 3 వేల మంది మహిళలకు కుట్టులో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఉచితంగా కుట్టు మిషన్ల ను పంపిణీ కూడా చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు నెల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. కాగా, కుట్టు శిక్షణ ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగనున్నదని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్స్టైల్స్ కమిషనర్ బుద్ధ ప్రకాష్, డైరెక్టర్ మెహర్, యంగ్ ఇండియా, కిటెక్స్ కంపెనీల ప్రతినిధులు, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.