ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో
కొత్త మార్గదర్శకాలు.. జీవో విడుదల

హైదరాబాద్, జూన్ 27 (విశ్వం న్యూస్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వ్యయాన్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల శ్లాబు (స్లాబ్) విస్తీర్ణంపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తూ గృహనిర్మాణ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల శ్లాబు విస్తీర్ణం కనిష్టంగా 500 చదరపు అడుగులు, గరిష్ఠంగా 750 చదరపు అడుగులకే పరిమితం చేయాలని పేర్కొంది. అలాగే, శ్లాబు ముందువైపు మూడు అడుగులు, మిగిలిన మూడు వైపులా ఒక్కో అడుగు మాత్రమే అదనపు విస్తీర్ణం ఉండేలా నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్లాబు విస్తీర్ణం అవసరానికి మించి పెరగడం వల్ల లబ్ధిదారులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
ఈ నేపథ్యంలో నిర్మాణ వ్యయాన్ని నియంత్రించడంతో పాటు, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతోనే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలనే ఉద్దేశంతో ఈ పరిమితులను విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతతో పాటు ఖర్చు నియంత్రణకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.