కమల దళానికి దిశానిర్దేశం
చేసిన రామచందర్ రావు

తిమ్మాపూర్, మే 30 (విశ్వం న్యూస్) : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ప్రారంభమైన పండిత్ దీన్ దయాల్ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ తరగతులను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించిన రామచంద్రరావు, శిక్షణా తరగతులను ఉద్దేశించి మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అనేక మంది కార్యకర్తలు పార్టీ ఎదుగుదలకు విశేష కృషి చేశారని కొనియాడారు. కరీంనగర్‌లోని బీజేపీ నాయకత్వం, కార్యకర్తల పట్టుదల వల్లే రాష్ట్రంలో తొలిసారిగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుందని పేర్కొన్నారు.

బీజేపీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన “ఏకాత్మ మానవవాదం” సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిన రాజకీయ పార్టీ అని, సిద్ధాంతమే పార్టీ బలమని అన్నారు. దేశం మొదట, పార్టీ తర్వాత, వ్యక్తిగత ప్రయోజనాలు చివర అనే భావనతో బీజేపీ ముందుకు సాగుతోందని చెప్పారు.

సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, అదే అంత్యోదయ తత్వమని వివరించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల త్యాగాలు, కృషి అమూల్యమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోందన్నారు. “సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” నినాదంతో వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గత 12 ఏళ్లలో భారతదేశాన్ని ప్రపంచ వేదికపై బలమైన శక్తిగా మోదీ నిలబెట్టారని అన్నారు.
అనంతరం వివిధ అంశాలపై పార్టీ రాష్ట్ర నాయకులు శిక్షణా తరగతుల్లో ప్రసంగించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బోడిగే శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.