మార్చి మొదటి వారం నుండి కరీంనగర్ పార్లమెంటులో రేవంత్ రెడ్డి పాదయాత్ర

నియోజకవర్గ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం
కరీంనగర్, పిబ్రవరి 21 (విశ్వం న్యూస్) : హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా యాత్ర – మార్పు కోసం అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పాదయాత్ర మార్చి మొదటి వారంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో జరగనుంది. మొదట హుజరాబాద్ నియోజకవర్గం నుండి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర దశలవారీగా పార్లమెంటు నియోజకవర్గం లోని మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొనసాగనుంది.
ఇందుకు సంబంధించి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలోని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని నియోజకవర్గ ఇన్చార్జిలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు ముఖ్య నాయకుల బృందంతో నేడు వరంగల్ లో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమావేశమై పాదయాత్ర గురించి చర్చించడం జరిగింది.
ఈ సమావేశంలో పాదయాత్ర ఒకరోజులో ఒక నియోజకవర్గంలో ఎన్ని కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది ఇందుకు సంబంధించి ప్రజలకు ముందస్తుగా తెలియజేయవలసిన సమాచారం, ప్రసార మాధ్యమాల ద్వారా నిర్వహించవలసిన ప్రచారం, పార్లమెంట్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వం నెరవేర్చని హామీలు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు రూపొందించనున్న ప్రణాళికపై నాయకులకు రేవంత్ రెడ్డి గారు దిశా నిర్దేశం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పాదయాత్రను కరీంనగర్ పార్లమెంటులోని నియోజకవర్గస్థాయి నాయకులు కార్యకర్తల సమన్వయంతో ఘనంగా నిర్వహిస్తామని, నియోజకవర్గ స్థాయి ప్రజల ఆశీర్వాదంతో పాదయాత్రను విజయవంతం చేస్తామని పొన్నం ప్రభాకర్ గారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్, నియోజకవర్గాల ఇన్చార్జులు మేడిపల్లి సత్యం, బల్మూరు వెంకట్, అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పత్తి కృష్ణా రెడ్డి, బొమ్మనపెల్లి అశోక్ రెడ్డి, మెనేని రోహిత్ రావు, సత్తు మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.