రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మరియు తప్పుడు ఆరోపణలు అయన రాజకీయ నీచత్వానికి పరాకాష్ట
- రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రంగా స్పందించిన దాసోజు శ్రవణ్
హైదరాబాద్, అక్టోబర్27 (విశ్వం న్యూస్) : కొండని తొవ్వితే రేవంత్ రెడ్డికి చివరకు ఎలుక కూడా దొరుకలే! అంటూ డాక్టర్ శ్రీ శ్రవణ్ దాసోజు రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి తన కుతంత్ర రాజకీయాలను కొనసాగిస్తున్నారని, కేటీఆర్ ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ పాకాల తమ కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులతో విందు చేసుకుంటున్న సమయంలో, 300 మంది పోలీసులతో ఇంటిపై దాడి చేసి, ఆ విందును రేవ్ పార్టీగా చిత్రీకరించడం, ఇంటిని ఫార్మ్ హౌస్‌గా చూపించడం, పైగా ఆ విందును కేటీఆర్ కి అంటగట్టడం, చిల్లర రాజకీయాలకు పరాకాష్ట! అని డాక్టర్ శ్రవణ్ దాసోజు పేర్కొన్నారు.
డ్రగ్స్, రేవ్ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రజా సమస్యలను, అలాగే ప్రభుత్వ అవినీతిని మరుగున పెట్టడమే రేవంత్ రెడ్డి కుట్ర పూరిత ఉద్దేశం అంటూ ఆయన విమర్శించారు. డాక్టర్ శ్రవణ్ దాసోజు ప్రతిపక్ష నాయకుల కుటుంబాలను మరియు వారి వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగుతూ, ముఖ్యమంత్రి హోదాను, ప్రజా ప్రభుత్వ హోదాను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డిని తప్పుబట్టారు. ఈ చిల్లర రాజకీయాలు ప్రభుత్వ ప్రాధాన్యతలుగా మారడటం బాధాకరం అని అన్నారు. ఇది రేవంత్ రెడ్డి కురుచ మనస్తత్వానికి, ఆయన నమ్ముకున్న చిల్లర రాజకీయాలకు నిదర్శనం మాత్రమే. అని తేల్చి చెప్పారు.
దీనికి తోడు, కొంతమంది కేంద్ర మంత్రులు మరియు పార్లమెంటు సభ్యులు సందట్లో సడే మియా లెక్క, కేటీఆర్ గారిని లక్ష్యంగా చేసుకుని పనికిరాని ఆరోపణలు చేస్తూ, ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. చేతనైతే ప్రజాసమస్యలపై పోరాడండి, కానీ కుటుంబసభ్యులను వీధుల్లోకి లాగి శిఖండీ రాజకీయాలు చేయొద్దు. అని ఆయన సలహా ఇచ్చారు.