శ్వేతార్కాలయంతో కాజీపేటకు ప్రపంచ గుర్తింపు

- 30 నుంచి ‘శ్వేతార్క’ 27వ వసంతోత్సవాలు ప్రారంభం
- ఉత్సవాల వివరాలను వెల్లడించిన వేద పండితులు ఐనవోలు రాధాకృష్ణశర్మ, సాయి కృష్ణ శర్మ
కాజీపేట, ఏప్రిల్ 26 (విశ్వం న్యూస్): తెలంగాణ రాష్ట్ర విద్వత్ సభ ఉపాధ్యక్షులు, వేద పండితులు, స్వర్గీయ బ్రహ్మశ్రీ ఐనవోలు అనంత మల్లయ్య శర్మ స్థాపించిన స్వయంభు శ్వేతార్క మూల గణపతి దేవాలయంతో కాజీపేట పట్టణానికి ప్రపంచ గుర్తింపు లభించిందని ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఐనవోలు వెంకటేశ్వర్ల శర్మ, వేద పండితులు, ఆలయ నిర్వహకులు బ్రహ్మశ్రీ ఐనవోలు రాధాకృష్ణ శర్మ, ఐనవోలు సాయి కృష్ణ శర్మలు తెలిపారు. కాజీపేటలోని శ్వేతార్కాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

ఈనెల 30వ తేదీ నుంచి శ్వేతార్కాలయం 27వ వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మే 4వ తేదీ వరకు 5 రోజులపాటు జరిగే ఈ వసంతోత్సవాల సందర్భంగా.. ప్రతిరోజు ప్రత్యేక పూజలను నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వర్గీయ బ్రహ్మశ్రీ అయినవోలు అనంత మల్లయ్య శర్మ ఆధ్వర్యంలో గతంలో వసంతోత్సవాలను ఏ విధంగానైతే నిర్వహించామో అదే రీతిలో ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలను పీఠాధిశ్వరులు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారి ఆశీస్సులతో కొనసాగించనున్నట్లు తెలిపారు.

ఈ ఉత్సవాలకు విచ్చేసే వేలాది మంది భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు ప్రముఖులచే సాంస్కృతిక ఉత్సవాలను, ప్రత్యేక దర్బారు సేవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్వేతార్కాలయం స్థాపించి 27వ వసంతోత్సవాల నేపథ్యంలో ఈసారి ప్రత్యేకంగా ఏనుగుపై శ్వేతార్క మూల గణపతిని కాజీపేటలో వాడవాడల ఊరేగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తమ తండ్రిగారైన.. గురువైన.. బ్రహ్మశ్రీ ఐనవోలు అనంత మల్లయ్య శర్మ ఆదర్శాలను కొనసాగించే విధంగా ఆలయ కేంద్రంగా వైద్య చికిత్స సౌకర్యాలను, నిత్యాన్నదానం, వేసవిలో మంచినీటితో పాటు ఆహార పదార్థాలను అందించే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వసంతోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న వైద్య శిబిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు సూచించారు.
ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. వసంతోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి.. ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రంగా శ్వేతార్కాలయమును తీర్చిదిద్దడంలో స్వర్గీయ బ్రహ్మశ్రీ ఐనవోలు అనంత మల్లయ్య శర్మ తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. అనంత మల్లయ్య శర్మ సూచించిన మార్గంలో ఆయన కుమారులు ఆధ్యాత్మిక అభివృద్ధికి కృషి చేస్తుండడం అభినందనీయం అని కొనియాడారు. ఈ సందర్భంగా వసంతోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో వసంతోత్సవాల పలు విభాగాల నిర్వాహక బాధ్యులు సదానందం, శ్రీనివాస్, డాక్టర్ సరిత శ్రీ, శివరాం, రవి, సుధీర్, అరుణ్ రెడ్డి, మనీ, వీరేందర్, దేవాలయ ప్రచార కార్యకర్త పెరుమాండ్ల సాంబమూర్తి, అర్చకులు, దేవాలయ కార్యకర్తలు, పలువురు భక్తులు పాల్గొన్నారు.
వార్త…. శ్యామ్🖋️