క్రీడా మైదానాల ప్రైవేటీకరణ ఆపాలి : ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
క్రీడా మైదానాల ప్రైవేటీకరణ
ఆపాలి:డా.దాసోజు

విశ్వం న్యూస్/హైదరాబాద్, సెప్టెంబర్ 12 : GHMC పరిధిలోని క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి పిల్లలకు క్రీడలను దూరం చేసే విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ఆయన స్పష్టం చేశారు.
శాసనమండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించిన డా. శ్రవణ్.. బస్తీలు, పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాల్లోని క్రీడా మైదానాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే అధిక ఫీజుల కారణంగా పేద పిల్లలు క్రీడలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టి ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని కోరారు.
అదేవిధంగా రాష్ట్రంలో ‘నో పీఈటీ – నో స్కూల్’ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాల, కళాశాలలో సర్టిఫైడ్ B.P.Ed, M.P.Ed అభ్యర్థులను వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమించడం తప్పనిసరి చేయాలని సూచించారు.
రాష్ట్రంలో వేలాది మంది B.P.Ed, M.P.Ed పూర్తి చేసిన అభ్యర్థులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యాసంస్థలో PET నియామకాన్ని తప్పనిసరి చేయడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు విద్యార్థులకు క్రీడా శిక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని పేర్కొన్నారు.
క్రీడలను పేదలకు దూరం చేయకుండా, నిరుద్యోగ క్రీడా విద్యావంతులకు న్యాయం చేసేలా ప్రభుత్వం ఈ రెండు అంశాలపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని డా. దాసోజు శ్రవణ్ కోరారు.