స్పీకర్ బులెటిన్ రాజ్యాంగ విరుద్ధం: దాసోజు శ్రవణ్

స్పీకర్ బులెటిన్ రాజ్యాంగ విరుద్ధం: దాసోజు శ్రవణ్

హైదరాబాద్‌, నవంబర్‌ 13 (విశ్వం న్యూస్): ఫిరాయింపుల కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన తాజా బులెటిన్ రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ —

“లెజిస్లేటివ్ ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతుండగా, మీడియా, సందర్శకులు, మాజీ ప్రజాప్రతినిధులపై అసెంబ్లీ ప్రవేశ నిషేధం విధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అడ్వకేట్లు మొబైల్ ఫోన్లు తీసుకురావొద్దన్న ఆదేశం హాస్యాస్పదం. సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ విచారణల్లో కూడా మొబైల్ ఫోన్లు అనుమతిస్తారు. మరి ఈ విచారణలో ఇంత రహస్యంగా ఎందుకు?” అని ప్రశ్నించారు.

“ఇది స్పీకర్ వ్యక్తిగత నిర్ణయం కాదు — రేవంత్ రెడ్డి ప్రణాళికబద్ధంగా చేసిన చర్య. బులెటిన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని స్పీకర్‌గారికి లేఖ రాశాను,” అని తెలిపారు.

ఫిరాయింపుల విచారణను లైవ్‌స్ట్రీమింగ్ ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించాలని డా. శ్రవణ్ డిమాండ్ చేశారు. “తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై వాదనలు ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది,” అని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆయన విమర్శిస్తూ —
“రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధోగతికి చేరింది. బడ్జెట్‌లో 2.30 లక్షల కోట్లు ప్రతిపాదించినా, సెప్టెంబర్‌ నాటికి 76 వేల కోట్లు మాత్రమే వసూలయ్యాయి — అంటే 33 శాతం. రెవెన్యూ, GST, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ ఆదాయాలు అన్ని విభాగాల్లో తీవ్రంగా పడిపోయాయి. కానీ అప్పులు మాత్రం 83 శాతం పెరిగాయి. ఇప్పటికే రూ.4.87 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇవన్నీ రేవంత్ ఆర్థిక అత్యాచారం ఫలితమే,” అని వ్యాఖ్యానించారు.

“కాగ్ డేటా రేవంత్ పాలన అసలైన బట్టలు విప్పేసింది. అనుభవం లేని సీఎం చేతిలో రాష్ట్రం దెబ్బతింది. హైడ్రా, ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరిట ప్రజలపై దోపిడీ సాగుతోంది,” అని మండిపడ్డారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మాట్లాడుతూ —
“బోగస్ ఓటింగ్‌కు పోలీసులు సహకరించారు. కాంగ్రెస్, ఎంఐఎం రెండు పార్టీలూ అక్రమాలకు పాల్పడ్డాయి. ఎంత అక్రమాలు చేసినా చివరికి ధర్మమే గెలుస్తుంది,” అని డా. దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ నేతలు సతీష్ రెడ్డి, హరి రమా దేవి, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *