కాజీపేట:పేద విద్యార్థులకు
అండగా నిలువడమే లక్ష్యంగా…
కాజీపేట (విశ్వం న్యూస్) : ప్రభుత్వ ఉన్నత పాఠశాల- రైల్వే గేట్ లో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులుగా పని చేస్తున్న పెరుమాండ్ల సాంబమూర్తి పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. 30 ఏళ్లుగా ఆదర్శవంతమైన సేవలను కొనసాగిస్తున్నారు. తన సబ్జెక్టు బోధన..క్రమశిక్షణ పర్యవేక్షణతో పాటు కుదిరించి రాసేలా చూడడం తన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలాగే క్రీడాభివృద్ధి కోసం తన వంతు సహకారాన్ని అందిస్తుంటాడు. విద్యార్థులను కల్చరల్ యాక్టివిటీస్ లో ఉత్సాహంగా పాల్గొనేలా చూస్తాడు. ప్రోత్సాహక బహుమతులు అందించడంలో ముందు ఉంటాడు. ఏ బడికి వెళ్లినా ఆ బడి విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటాడు. దాతల సేవలను బడులకు ఉపయోగపడేలా చేస్తాడు. తాను పనిచేసిన బడులలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి..ప్రహారిగోడ, క్రీడా మైదానం వంటి తదితర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తాడు. బడులలో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధుల, అధికారుల దృష్టికి తీసుకురావడానికి వినతిపత్రంలను సమర్పిస్తారు. బడులలో జరిగే వేడుకలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేలా శిక్షణ ఇస్తారు.
విద్యార్థులు నిత్యం బడులకు వచ్చే వాతావరణాన్ని కల్పిస్తారు. సిస్టమాటిక్ గా స్టేజీ మేనేజ్మెంట్ చేస్తూ ఆకట్టుకుంటాడు. 1993 నుంచి 2009 వరకు కాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర)లో, 2009 నుంచి 2018 వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల-శంభునిపేటలో, 2018 నుంచి 2022 వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల-బాసిత్ నగర్ లో పని చేసి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు అందుకున్నాడు. అనేక స్వచ్ఛంద సంస్థలు ఆయన చేసిన సామాజిక సేవలను గుర్తించి అవార్డులను ప్రధానం చేసి సత్కరించాయి. అనేకమంది పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించి సాంబమూర్తి సార్ సేవలను కొనియాడుతూ ఘనంగా సత్కరించి గురుభక్తిని చాటుకుంటున్నారు.
1993 నుంచి నేటి వరకు ఏ బడుల విద్యార్థి కైనా ఎటువంటి సమస్యలు ఎదురైనా.. ఆపదలు వచ్చినా.. వారికి గుర్తుకు వచ్చేది సాంబమూర్తి సార్. అనేక టెన్త్ బ్యాచ్ లతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ వారికి మార్గదర్శనం చేస్తుంటాడు. టీచర్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏళ్లు గడుస్తున్నా పూర్వ విద్యార్థులు మరిచిపోకుండా..నాతో సంబంధాలను కొనసాగిస్తుండడం గర్వంగా అనిపిస్తుంది. ఏ బడిలో పని చేసిన తల్లిదండ్రుల సహకారం మరువలేనిది. పేద విద్యార్థులకు అండగా నిలవడమే లక్ష్యంగా.. ఆదర్శవంతమైన సేవలు అందించడానికి కృషి చేస్తాను.