మన ఊరు మనబడి పెండింగ్ పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
రామగుండం, జనవరి 10 (విశ్వం న్యూస్) : జిల్లాలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలలో మన ఊరు మన బడి పెండింగ్ పనులు సంక్రాంతి నాటికి పూర్తిచేసి ప్రారంభానికి సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రామగుండం, అంతర్గాం మండలాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను తనిఖీ చేశారు. రామగుండంలోని విఠల్ నగర్ లో ఉన్న అప్పర్ ప్రైమరీ పాఠశాల, రామగుండం లోని ప్రైమరీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ మన ఊరు మన బడి కింద చేపట్టిన స్ట్రక్చరల్ పనులు పూర్తి చేసామని, మిగిలి ఉన్న చిన్న చిన్న మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేసి, గ్రౌండ్ లెవెలింగ్, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
మోడల్ పాఠశాలలను సంక్రాంతి నాటికి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి అనుగుణంగా పనులు చేసి సన్నద్దం కావాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం రామగుండం మండలం హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రైమరీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం అంతర్గాం మండలంలో అక్బర్ నగర్ లోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలను కలెక్టర్ పరిశీలించి వెనుకవైపు గడ్డివేసి ఆకర్షణీయమైన మొక్కలు నాటాలని, కిచెన్ షెడ్డు రినోవేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ పర్యటనలో రామగుండం మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, ఎం.ఆర్.ఓ.వేణు గోపాల్, ఎంపిడిఓ యాదగిరి, ఏ.ఇ.రాజు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
