గుండెపోటుతో మావోయిస్టు
అగ్రనేత కట్టం సుదర్శన్ మృతి

ఛత్తీస్ గడ్, జూన్ 4 (విశ్వం న్యూస్) : ఛత్తీస్ గడ్ లో ని బస్తర్ మావోయిస్టుల పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటి సభ్యుడు (ఆనంద్) అలియాస్ కట్టం సుదర్శన్ గుండె పోటుతో మృతి చెందాడు.
ఆయన మృతిపై సి.పి.ఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మే 31న మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. మరణానంతరం పోలిట్ బ్యూరో ఆయన చాయ చిత్రాలను కూడా విడుదల చేసినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే జూన్ 5 నుండి ఆగస్ట్ 3 వరకు దేశవ్యాప్తంగా ఆనంద్ సంస్మరణ సమావేశాలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుదర్శన్ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుదర్శన్ స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం. సుదర్శన్ బాల్య స్నేహితులతో పాటు బెల్లంపల్లి పట్టణంలోని ఆయా పార్టీల నాయకులు ఉదయం నుంచి ఆయన ఇంటికి వచ్చి సంఘీభావం తెలిపారు. 1978 సమయంలో పీపుల్స్ వార్ పార్టీ పట్ల సుదర్శన్ ఆకర్షితుడయ్యాడు. పీపుల్స్ వార్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కుందేళ్ళ శంకర్, దస్తగిరి లను హత్య చేసిన యాక్షన్ కమిటీలో ఉన్నారు.
అనంతరం పీపుల్స్ వార్ పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన… అంచెలంచెలుగా ఎదిగి… మృతి చెందే వరకు కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగారు.