దేశ రక్షణకు సైనికులు ప్రజల
రక్షణకు పోలీసుల నిరంతర కృషి

- శాంతిభద్రతలే కాదు సామాజిక సేవలో పోలీస్ లు ప్రథమం.
- పోలీసులు కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా పనిచేశారు – వారి సేవలకు నా సెల్యూట్.
- రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.
కరీంనగర్ బ్యూరో, జూన్ 4 (విశ్వం న్యూస్) : సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడంతోపాటు, సామాజిక సేవలను అందించడంలోను తెలంగాణ పోలీస్ విభాగం ప్రథమంగా నిలిచిందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది వేడుకలలో భాగంగా 3వ రోజు, జూన్ 4వ తేదిన జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సురక్షా దినోత్సవం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, సిపి, చోప్పదండి ఎమ్మెల్యే లతో కలిసి రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 9 వసంతాలను పూర్తిచేసుకొని 10వ వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్బంగా అందరికి శుభాభివందనాలను తెలియజేశారు. దేశరక్షణ కోసం సైనికులు నిరంతరపోరాడితే, ప్రజల రక్షణ కొరకు పోలీసులు అహర్నిశలు కృషిచేస్తున్నారని, శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా సామాజిక సేవలోను విశేష సేవలందించి తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచారని అన్నారు. పోలీసులు తమ కుంటంబాలను వదిలి, ప్రజల రక్షణ కొరకు నిరంతరం కృషిచేస్తూన్నారని, పోలీసుల పై నమ్మకంతో కంటి నిండా నిద్రపోతున్నారని అన్నారు. కరీంనగర్ లో అపహరణకు గురైన చంటిబిడ్డను రక్షించడం మొదలు ఆత్మహత్యలకు వెళ్లిన వారిని రక్షించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి ఇంటికి పంపిస్తున్నారని, పండుగల , ప్రత్యేకదినాల సందర్భంగా మద్యాన్ని సేవించి వాహనాలు నడిపే వారిని డ్రంక్ ఆండ్ డ్రైవ్ తో నిలువరించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారన్నారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించే వారిపై పిడి యాక్టలను అమలు చేయడం, దొంగతనాలు జరగకుండా నిలువరించడంతో పాటు తిరిగి మరోసారి అటువైపు వెళ్లకుండా కౌన్సిలింగ్ ఇస్తు సమాజ పరరక్షణలో బాగస్వాములవుతున్న పోలీసుల సేవలు చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. అదేవిధంగా ఆన్ లైన్ మోసాలు జరగకుండా సైబర్ క్రైమ్, మహిళారక్షణకు షి టీమ్స్ తో ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించగలిగారన్నారు.

సమాజ సేవలోనే కాదు సమసమాజ స్థాపనలో మేమ సైతం అంటు కళాకారులతో చట్టాలపై అవగాహనను కల్పిస్తూ, నిరుద్యోగులకు ఉపాది భరోసాను కల్పించేలా బడాకంపనీలతో జాబ్ మెళాను నిర్వహించడం తో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆకుపచ్చని తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం, మియావాకి ప్లానిటేషన్ వంటివి చేపట్టి ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారని అభినందించారు.
మంత్రి ఈ సందర్భంగా ఉత్తమ సేవలను అందించిన పలువురు పోలీసులకు బహుమతులను అందించి అనంతరం మంత్రి పోలీసు వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

పోలీస్ హెడ్ క్వార్టర్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, కమాన్, గీతా భవన్, ఐ బి, కోర్ట్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ విగ్రహం, రాజీవ్ చౌరస్తా, అమరవీర స్తూపం మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ఈ ర్యాలీ వెళ్ళింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, సిపి సబ్బరాయుడు, చోప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నగర మేయర్ వై. సునీల్ రావు, సుడా చైర్మన్ జేవి రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో,లా ఆండ్ ఆర్డర్ డిసిపి శ్రీనివాస్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, ప్రతాప్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి టి వెంకన్న, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గోన్నారు.