హనుమకొండలో విషాదం.. పవన్ అభిమాని
నిరంజన్ మృతి

హనుమకొండ, జూలై 8 (విశ్వం న్యూస్) : హనుమకొండకు చెందిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. అరుదైన జన్యుపరమైన వ్యాధి డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (డీఎండీ)తో చిన్నప్పటి నుంచే పోరాడుతున్న నిరంజన్ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.
వరంగల్–హనుమకొండకు చెందిన పొనుగోటి రాము, మానస దంపతుల కుమారుడైన నిరంజన్ చిన్న వయసులోనే డీఎండీ బారిన పడ్డాడు. ఈ వ్యాధి కారణంగా క్రమంగా కండరాలు బలహీనపడటంతో పాటు శరీర ఎదుగుదల కూడా ఆగిపోయింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలన్న కోరికను ఇటీవల నెరవేర్చుకోవడం అతనికి జీవితాంతం మధుర జ్ఞాపకంగా నిలిచింది.
అయితే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో నిరంజన్ కన్నుమూశాడు. అతని మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.