
హైదరాబాద్, జూలై 9 (విశ్వం న్యూస్):తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గంలో మార్పులకు సిద్ధమవుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వం, పార్టీకి ఇబ్బందిగా మారుతున్న ఇద్దరు మంత్రులను మంత్రి వర్గం నుంచి తప్పించే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతి కోరినట్లు సమాచారం.
మంత్రుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం కోరిన నేపథ్యంలో, ప్రతి మంత్రి పనితీరుపై రేవంత్ రెడ్డి సమగ్ర నివేదిక సమర్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివాదాలకు కారణమవుతూ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న మంత్రులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కొంతమంది మంత్రులు శాఖల పనితీరుపై దృష్టి పెట్టకుండా తరచూ వివాదాల్లో చిక్కుకోవడం, కేబినెట్ సమావేశాలకు గైర్హాజరు కావడం, ప్రభుత్వ నిర్ణయాలకు భిన్నంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలపై పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
మొదట ఆయా మంత్రులకు మార్పు కోసం అవకాశం ఇచ్చినా, వారి వ్యవహారశైలిలో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో ఇప్పుడు కఠిన నిర్ణయాలపై చర్చ జరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కొన్ని జిల్లాల్లో సీనియర్ నేతల మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడటం, పరస్పరం అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకోవడం కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని అసంతృప్తికి గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వంలో క్రమశిక్షణ, సమన్వయం పెంచేందుకు మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలపై ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అనంతరం జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, పార్టీలో ఐక్యతను బలోపేతం చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.