ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

ప్రముఖ నటుడు
గిరిబాబు కన్నుమూత

  • 600కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర.. సినీ పరిశ్రమలో విషాదం

విశ్వం న్యూస్, హైదరాబాద్‌, నవంబర్ 14, 2026: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు గిరిబాబు మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


600కు పైగా సినిమాల్లో నటన
1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన గ్రామంలోని టూరింగ్ టాకీస్‌లో ఎక్కువ సమయం గడిపేవారు. దీంతో గ్రామస్థులు ఆయనను సరదాగా ‘సినిమా పిచ్చోడు’ అని పిలిచేవారు. రంగస్థలం ద్వారా నటనకు శ్రీకారం చుట్టిన ఆయన 1973లో విడుదలైన ‘జగమే మాయ’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు.

ఆ తర్వాత కురుక్షేత్రం, దేవతలారా దీవించండి, మా దైవం, భైరవద్వీపం వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. కితకితలు, అతడు, నువ్వే కావాలి, అల్లుడా మజాకా, సిసింద్రి, ప్రతినిధి, ఆ ఆ, గీత గోవిందం తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో 600కు పైగా చిత్రాల్లో విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.


దర్శకుడిగానూ ప్రతిభ
నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా గిరిబాబు తన ప్రతిభను చాటుకున్నారు. సింహగర్జన, మెరుపుదాడి, రణరంగం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటన, దర్శకత్వం రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. చివరి చిత్రం ‘అన్ని మంచి శకునములే’


2023లో విడుదలైన ‘అన్ని మంచి శకునములే’ చిత్రంలో గిరిబాబు చివరిసారిగా వెండితెరపై కనిపించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన న్యాయమూర్తి పాత్రను పోషించారు.

కుటుంబ నేపథ్యం : గిరిబాబు భార్య శ్రీదేవి 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు రఘుబాబు, బోసుబాబు ఉన్నారు. పెద్ద కుమారుడు రఘుబాబు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటుడిగా కొనసాగుతున్నారు. గిరిబాబు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *