హరీష్ రావుపై వేధింపులను తీవ్రంగా ఖండిస్తున్నాం: ఎంఎల్సీ దాసోజు శ్రవణ్
ఫోన్ ట్యాపింగ్ పేరుతో
రాజకీయ కక్షసాధింపు

హైదరాబాద్, జనవరి 20, 2026 (విశ్వం న్యూస్) : “దుర్మార్గుడు దేశాన్ని తగలబెట్టి, ఆ బూడిద కుప్ప మీద సింహాసనాన్ని వేసుకుంటాడు” అన్న సన్ జూ సూక్తి నేడు తెలంగాణ రాజకీయాలకు అద్దం పడుతోందని బీఆర్ఎస్ నేత, ఎంఎల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్నది ప్రజాపాలన కాదు, ప్రతీకార రాజకీయ నాటకమని ఆయన ధ్వజమెత్తారు.
అప్రజాస్వామిక విచారణ
నిరాధారమైన, నిలకడలేని ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారిని గత 7.5 గంటలుగా విచారణ ముసుగులో వేధిస్తున్న తీరు అమానుషమని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు.
ప్రశ్నిస్తే వేధింపులా?
సింగరేణిలో జరుగుతున్న అవినీతిని హరీష్ రావు గారు ప్రశ్నించినందుకే ప్రభుత్వం ఈ రీతిలో కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆయన ఆరోపించారు. ప్రశ్నించడమే నేరమైతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదని అన్నారు.
వ్యవస్థల దుర్వినియోగం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార గర్వంతో పోలీస్ వ్యవస్థను తన వ్యక్తిగత రాజకీయ కక్షలకు పావులుగా మార్చారని దాసోజు శ్రవణ్ ఘాటుగా విమర్శించారు. ఖాకీ డ్రెస్సును ‘ఖాదీ’గా మార్చి, చట్టాన్ని కాదు—కాంగ్రెస్ పార్టీ రాసిన స్క్రిప్ట్‌ను అమలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయ పతనం తప్పదు
ప్రజాస్వామ్యంలో ప్రశ్నను నేరంగా ముద్ర వేయడం, విమర్శించిన వారిపై సెక్షన్లతో సంకెళ్లు వేయడం దుర్మార్గమైన పాలనకు నిదర్శనమని అన్నారు. నేడు ప్రయోగిస్తున్న ఈ ‘పోలీసు అస్త్రాలు’ రేపు మీ రాజకీయ పతనానికే పునాదిగా మారతాయని హెచ్చరించారు.
ధైర్యంగా పోరాడుతాం
అణచివేత పెరిగే కొద్దీ తిరుగుబాటు మరింత ఉద్ధృతంగా మారుతుందని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. చీకటి రోజులు శాశ్వతం కావని, సత్యం నిప్పులాంటిదని, న్యాయమే అంతిమంగా గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ హరీష్ రావు గారికి అండగా నిలుస్తాయని ఆయన ప్రకటించారు.
