నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం: సీఎం కేసీఆర్‌

నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (విశ్వం న్యూస్) : ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్‌, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు.
పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని చెప్పారు. అటవీ భూములపై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామన్నారు. గుత్తికోయలను తీసుకువచ్చి అడవులను నరికివేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అటవీ అధికారులపై దాడులు సరికాదన్నారు. గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసన్నారు. పోడుభూములపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రకటన చేశారు.
పోడుభూములపై ప్రతిసారి రాజకీయ చేయడం సరికాదని సూచించారు. పోడు భూములు అనేవి హక్కు కాదు… దురాక్రమణ అని స్పష్టం చేశారు. విచక్షణారహితంగా అడవులు నరికేయడం సరికాదన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. పోడు, అటవీ భూములు పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజనులపై దౌర్జన్యం జరుగకుండా చూడాలని సూచించారు. కొందరు అగ్ర కులస్థులు గిరిజన యువతులను పెండ్లిచేసుకుంటున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పలువురు ఉన్నత కులాలవారు అటవీ భూములను కబ్జాచేశారన్నారు. 10, 20 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా అని ప్రశ్నించారు.

దళితబంధు తరహాలోనే గిరిజన బంధు
ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్‌, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అయితే భూములు తీసుకున్న గిరిజనులు ఇకనుంచి పోడు భూములను రక్షిస్తామని హామీ ఇవ్వాలన్నారు. పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు.

సాయుధ దళాలతో పహారా
గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడిచేయవద్దని సూచించారు. అదేసమయంలో అధికారులపైనా గిరిజనులు దాడులు సహించబోమన్నారు. గుత్తికోయల గూండాగిరి మంచిది కాదని చెప్పారు. ఇకనుంచి అటవీ ప్రాంతంలోని ఒక్క చెట్టును కూడా కొట్టనివ్వమని చెప్పారు. అటవీ సరిహద్దులు పెట్టి సాయుధ దళాలతో పహారా ఏర్పాటుచేస్తామని తెలిపారు. గిరిజనుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ పెరిగిందని ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *