‘నిన్న హిమాచల్.. నేడు కర్ణాటక.. రేపు తెలంగాణ’

హైదరాబాద్, మే 13 (విశ్వం న్యూస్) : కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపొందడంతో రాష్ట్రంలోనూ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే గాంధీభవన్​లో సందడి వాతావరణం నెలకొంది. పెద్దసంఖ్యలో గాంధీభవన్​కు చేరుకున్న హస్తం కార్యకర్తలు, నాయకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్​కి.. రేవంత్​రెడ్డి ఫోన్​ చేసి అభినందనలు తెలిపారు.

మత రాజకీయాలను తిరస్కరించారు : కాంగ్రెస్ మతాన్ని రాజకీయాలకు వాడుకోదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. కానీ బీజేపీ మత రాజకీయలతో కర్ణాటకలో అధికారంలోకి రావాలనుకుందని ఆరోపించారు. దీనిని అక్కడి ప్రజలు తిరస్కరించారని తెలిపారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఎత్తుగడలను ఓటర్లు చిత్తు చేశారని అన్నారు. జేడీఎస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ చూశారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కేటీఆర్‌కు ఇష్టం లేదని రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు. కర్ణాటక ఫలితాలు రాష్ట్రంపై ప్రభావితం చూపుతాయని రేవంత్​రెడ్డి వివరించారు. వీటిపై రాహుల్‌గాంధీ జోడో యాత్ర ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. నిన్న హిమాచల్, నేడు కర్ణాటక, రేపు తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాహుల్​గాంధీపై అనర్హత వేటు అక్కడి ప్రజలకు నచ్చలేదని పేర్కొన్నారు. అదానీ అవినీతిపై మాట్లాడినందుకు ఆయనపై కక్ష కట్టారని రేవంత్​రెడ్డి ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయి : ఇందులో భాగంగానే రాహుల్​గాంధీ ఇంటిని ఖాళీ చేయించారని.. మరీ మాజీ ఎంపీ గులాంనబీ అజాద్ ఇళ్లు ఎందుకు ఖాళీ చేయించలేదని రెేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. మోదీ ఓడిపోతే భారత్​ రాష్ట్ర సమితి ఎందుకు బాధ పడుతోందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు భావిస్తున్నారని రేవంత్​రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *