ప్రభుత్వాలు మారితే రేషన్ కార్డులూ మారాలా?
రేషన్ కార్డా.. కాంగ్రెస్ ప్రచార కార్డా?

హైదరాబాద్/సంగారెడ్డి, ఆగస్టు 15 (విశ్వం న్యూస్): పేదల ఆహార భద్రతకు సంబంధించిన రేషన్ కార్డులను సైతం రాజకీయ ప్రచార వేదికగా మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలం ప్రజల వద్ద ఉండాల్సిన స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలను ముద్రించడం ఎందుకని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం మారినా, మంత్రులు మారినా ఈ కార్డుల పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నాయి.
నేటి నుంచి రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకానికి సంబంధించిన కార్డులపై అధికార పార్టీ నేతల ఫొటోలు ముద్రించడం వెనుక ఉద్దేశమేంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వాలు మారితే కార్డులూ మారాలా? రేషన్ కార్డు అనేది ప్రభుత్వానికి చెందిన ప్రచార పత్రం కాదు.. ప్రజలకు లభించే హక్కు, ఆహార భద్రతకు గుర్తింపు. అలాంటి శాశ్వత ప్రాధాన్యత కలిగిన కార్డులపై అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ముద్రిస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన ప్రతిసారీ కొత్త కార్డులు ముద్రించాల్సిన పరిస్థితి వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గంలో మార్పులు జరిగినా ఇదే సమస్య తలెత్తుతుందని, చివరకు భారం మాత్రం ప్రజాధనంపైనే పడుతుందని విమర్శలు వస్తున్నాయి.
కేంద్రం నిధులపై రాష్ట్రం ప్రచారమా? పేదలకు అందుతున్న ఉచిత రేషన్‌లో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని కేంద్రం ఉచితంగా అందిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కిలో బియ్యం అందిస్తూ రాజకీయ ప్రచారం చేసుకుంటోందని వారు విమర్శించారు. కేంద్రం అందిస్తున్న బియ్యానికి సంబంధించిన పథకంలో రాష్ట్ర ప్రభుత్వ నేతల ఫొటోలు ఎందుకు ముద్రించారని ప్రశ్నించారు.
రేషన్ బియ్యంలో 90 శాతం కేంద్రం నిధులతోనే అందుతున్నందున ప్రొటోకాల్ ప్రకారం కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ముద్రించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని నిలిపివేసి, అన్ని కార్డులపై ప్రధాని ఫొటోతో ముద్రించి పంపిణీ చేయాలని కోరారు. ముద్రణ ఖర్చులు, టెండర్లు, కాంట్రాక్టు వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
16.32 లక్షల కుటుంబాలకు కొత్త కార్డులు: గత ఏడాదిన్నరలో రాష్ట్ర ప్రభుత్వం 16,32,810 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల సంఖ్య 1,06,28,092కు, లబ్ధిదారుల సంఖ్య 3.43 కోట్లకు చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అయితే కోట్లాది మంది పేదల జీవితాలతో ముడిపడిన రేషన్ కార్డులను రాజకీయ ప్రచారానికి వాడకుండా.. శాశ్వతంగా ఉపయోగపడేలా రూపొందించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. సంక్షేమ కార్డుపై ఎవరి ఫొటో ఉండాలి అన్నదానికంటే.. ప్రజల హక్కును రాజకీయ బ్రాండింగ్‌కు దూరంగా ఉంచాలన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.