ఫొటోల కోసం ₹100 కోట్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దాసోజు ఫైర్!

ఫొటోల కోసం ₹100 కోట్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దాసోజు ఫైర్!

  • రేషన్‌ కార్డులు సంక్షేమానికా.. కాంగ్రెస్‌ ప్రచారానికా?

హైదరాబాద్‌, ఆగస్టు 16: రేషన్‌ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలను ముద్రించేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ తీవ్రంగా విమర్శించారు.

ఆగస్టు 15న సంగారెడ్డితో పాటు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 1.05 కోట్ల లామినేటెడ్‌ రేషన్‌ కార్డుల పంపిణీ పేరుతో భారీగా ఖర్చు చేశారని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉద్యోగుల పెన్షన్లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించేందుకు నిధులు లేవంటున్న ప్రభుత్వం.. సొంత రాజకీయ ప్రచారం కోసం సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ప్రజల ఆహార భద్రతకు సంబంధించిన రేషన్‌ కార్డులను రాజకీయ ప్రచార కరపత్రాలుగా మార్చడం తగదన్నారు. గతంలో ప్రజాధనంతో ప్రభుత్వ పథకాలపై రాజకీయ నాయకుల ఫొటోలు వద్దని కేసీఆర్‌ తిరస్కరించారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ఫొటోల విషయంలో గతంలో కాంగ్రెస్‌ నేతలు చేసిన విమర్శలు ఇప్పుడు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు వర్తించవా అని ప్రశ్నించారు.

రేషన్‌ కార్డులపై మంత్రి ఫొటో ముద్రించడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని దాసోజు ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే ఈ కార్డుల పరిస్థితి ఏమిటని, మళ్లీ మార్పుల కోసం మరో రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు.

రేషన్‌ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలను తొలగించి అధికారిక రాజముద్రతో కార్డులు ఇవ్వాలని, ఖర్చు చేసిన రూ.100 కోట్లపై కాగ్‌తో సమగ్ర ఆడిట్‌ నిర్వహించి బాధ్యుల నుంచి రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి ఫొటో ముద్రణపై న్యాయ, రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

పేదల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన ప్రజాధనాన్ని రాజకీయ ప్రచారానికి వినియోగించడం మానుకుని, వెంటనే ఫొటో కార్డుల కార్యక్రమాన్ని నిలిపివేయాలని దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *