యాసంగి పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

యాసంగి పంటను కొనుగోలు
చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

  • రాష్ట్రవ్యాప్తంగా 7100 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
  • రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
  • ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం.
  • పౌర సరఫరాల శాఖ ద్వారా శనివారం నాటికీ 4 కోట్ల15 లక్షల ధాన్యం కొనుగోలు చేశాం
  • వ్యాపారులకు మధ్యవర్తులకు ధాన్యం అమ్మ వద్దు
  • రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా యాసంగి పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.ఆదివారం కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కూరు, ముగ్దంపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ యాసంగి పంట ముందుగానే కోతకు వస్తుందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 15 రోజులు ముందుగానే ధాన్యం కొలుగోలు ప్రారంభించామన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నా మని, శనివారం నాటికి 420 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి నాలుగు కోట్ల 15 లక్షల విలువ చేసే 2000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైతే కొనుగోలు కేంద్రం సంఖ్యను పెంచుతామన్నారు. రైతులు తాము పండించిన ధాన్యం రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ గ్రామన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

రైతులు నిబంధన మేరకు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలన్నారు. ఒక్కో గ్రామంలో రెండు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ధాన్యంలో తేమ 17 శాతం మించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో వర్షాకాలం, యాసంగి రెండు పంటలు పండిస్తారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా యాసంకి పంటను కొనుగోలు చేస్తున్న ఘనత కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ దేనని అన్నారు. సమైక్య పాలనలో సాగునీరు లేక సగం భూమిపెట్టిన రోజులు ఉండేవని కానీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లో సైతం చెరువులు మత్తడి దూకుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న వ్యవసాయ సంక్షేమ పథకాలతో తెలంగాణలో భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయని అన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సకాలంలో నీళ్లు, యూరియా బస్తాలు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను సకాలంలో వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి మోసపోకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రలు ప్రారంభిస్తున్నామని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వయం చేసుకోవాలని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జెడ్ పి టి సి పురమల్ల లలిత, పిఎసిఎస్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్ వేణి మధు, సర్పంచ్ దుబ్బేట రమణారెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్, శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్ డాక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *