ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి ఇద్దరు దొంగలే!

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : తెలంగాణ‌లో ప్ర‌స్తుత‌ రాజ‌కీయం రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ ల‌ చుట్టూనే తిరుగుతోంది. ఈటెల, రేవంత్ మాట‌ల యుద్దంలోకి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఎంట‌ర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్, ఈటెల ఇద్ద‌రూ దొంగలేనని.. ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టాలని బీజేపీ, కాంగ్రెస్ చూస్తున్నాయన్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన హుజూరాబాద్ బైపోల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని.. రేవంత్ ను ఈట‌ల రాజేంద‌ర్ రూ.25కోట్ల‌కు కొన్నార‌ని.. ఆ లెక్క‌ల్లో తేడా వ‌చ్చినందు వ‌ల్ల ఇప్పుడు బ‌య‌ట వేసుకుంటున్నారన్నారు. బీజేపీలో స‌రైన గుర్తింపు లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈటల సహనం కోల్పోయి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఈటలకు హుజూరాబాద్ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మండిప‌డ్డారు.

కాగా ఇటీవ‌ల ఈటెల మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకటేనని, ఒకే నాణానికి ఉన్న బొమ్మ, బొరుసు వంటివని.. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకీ బీఆర్‌ఎస్‌ నుంచి రూ.25 కోట్లు ముట్టాయని, తాను చెప్పింది అబద్ధమని గుండెలపై చేయివేసుకుని చెప్పాలని డిమాండ్ చేయ‌డం తెలిసిందే.

ఈటల వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి కానీ, కేసీఆర్ నుంచి కానీ తాము ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని చెప్పారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. ఈటల ఆరోపణలు నిజమని 24 గంటల్లో నిరూపించాలన్నారు.
అయితే ఇంత చర్చకు కారణమైన ఈటల రాజేందర్ మాత్రం రేవంత్ సవాల్‌పై మౌనం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *