కమలం వైపు కాంగ్రెస్..? : డా. శ్రవణ్ దాసోజు

  • రేవంత్ పాలనపై
    డా. శ్రవణ్ దాసోజు తీవ్ర విమర్శలు

హైదరాబాద్, మే 10 (విశ్వం న్యూస్) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందా..? లేక బీజేపీ సిద్ధాంతాలతో నడిచే “ప్రైవేట్ కాంగ్రెస్ ఫ్రాంచైజీ”గా మారిందా..? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల “గుజరాత్ మోడల్”ను ప్రశంసించడం కాంగ్రెస్ అసలు సిద్ధాంతాలకు విరుద్ధమని విమర్శించారు.

రాహుల్ గాంధీ పదేళ్లుగా గుజరాత్ మోడల్‌పై విమర్శలు చేస్తుంటే, అదే నమూనాను తెలంగాణ అభివృద్ధికి ఆదర్శంగా చూపడం కాంగ్రెస్ కార్యకర్తలను, ప్రజలను అయోమయంలోకి నెడుతోందని అన్నారు. “హస్తం గుర్తుకు ఓటేస్తే, కమలం విధానాలతో పాలన ఎందుకు?” అని ప్రశ్నించారు.

ప్రధాని పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న “బడే భాయ్” వైఖరి చూస్తుంటే, కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలకు భిన్నంగా పాలన సాగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయని దాసోజు పేర్కొన్నారు. సంక్షేమ విధానాల స్థానంలో కార్పొరేట్ అభివృద్ధి, గిఫ్ట్ సిటీ తరహా ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లపై అధిక దృష్టి పెట్టడం బీజేపీ ఆర్థిక మోడల్‌ను అనుసరిస్తున్న సంకేతమని విమర్శించారు.

కేంద్రంతో సన్నిహిత సంబంధాల వల్ల తెలంగాణకు నిజంగా ఎంత ప్రయోజనం కలిగిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వచ్చిన నిధులు, పెట్టుబడులు, ఆర్థిక లాభాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

“తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ ఆత్మగౌరవం, సంక్షేమ పాలన కోసం ఓటేశారు గానీ, మోదీ గుజరాత్ మోడల్ రీబ్రాండింగ్ కోసం కాదు” అని డా. శ్రవణ్ దాసోజు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *