చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు:మంత్రి కొప్పుల

చివరి గింజ వరకు ధాన్యం
కొనుగోలు:మంత్రి కొప్పుల

  • 3.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేశాం
  • ప్రతి మండలానికి జిల్లా అధికారి ప్రత్యేకంగా నియమించి క్షేత్రస్థాయిలో పరిశీలన
  • రైస్ మిల్లుల వద్ద 24 గంటల వ్యవధిలో ధాన్యం దిగుమతి చేసేలా చర్యలు
  • రైస్ మిల్లుల వద్ద తూకంలో కోత పెడితె కఠిన చర్యలు

పెద్దపల్లి, మే 15 (విశ్వం న్యూస్) : సోమవారం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని స్టేట్ చాంబర్ లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ తో కలిసి రివ్యూ నిర్వహించారు.

యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్ మంత్రికి వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ రైతులకు ఇబ్బందులు కలగకుండా దాన్యం కొనుగోలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన సమావేశం గురించి వివరించారు. అకాల వర్షాల కారణంగా వచ్చిన ఇబ్బందులకు సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి రైతులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకున్నామని, పంట నష్టపోయిన వారికి ప్రతి ఎకరానికి 10 వేల చోప్పున మొదటి విడత మంజూరు చేశామని తెలిపారు.

రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి సంవత్సరం దాదాపు పదివేల కోట్లు ఖర్చు చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, నీటి తీరువా రద్దుచేసి ఉచితంగా సాగునీరు అందిస్తున్నామని, రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నామని, సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న రైతు సంక్షేమ చర్యల కారణంగా 2014తో పోలిస్తే చాలా రేట్లు పంట విస్తీర్ణం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు.

పెద్దపెల్లి జిల్లాలో 303 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 49 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేశామని, జిల్లాలో ఇప్పటివరకు 92 వేల 750 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి 89 వేల మెట్రి టన్నులను రైస్ మిల్లులకు రవాణా చేశామని, గత సంవత్సరంలో ఇదే సమయానికి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు చేస్తామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రైస్ మిల్లర్ల వద్ద స్థలం సమస్య ఉండటం, క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడిలో కొంత ఆలస్యం జరిగిందని, ఇకనుంచి ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నా మని, ప్రతి మండలానికి జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి క్షేత్ర స్థాయిలో వచ్చే చిన్న, చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.

రైస్ మిల్లుల వద్ద 24 గంటల్లో లారీ నుంచి ధాన్యం దిగుబడి చేసుకునేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, జిల్లా కలెక్టర్, అధికారులు ప్రతిరోజు పర్యవేక్షిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని, రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్ల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసిన తూకం కొనుగోలు కేంద్రాల వద్ద కోత పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలని మంత్రి పేర్కొన్నారు.

రైతుల అంశంలో ప్రతిపక్షాలు అనవసరపు రాజకీయం చేస్తున్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తక్కువ పంట విస్తీర్ణం ఉన్నప్పటికీ సరైన సమయంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయలేదని కరెంటు ఇబ్బందులతో రైతులు అనేక ఇబ్బందులకు గురైన విషయం అందరికీ తెలుసునని మంత్రి గుర్తు చేశారు.

దేశంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, అనేక రాష్ట్రాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసారని, పక్క రాష్ట్రాల్లో 15 కిలోలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కఠినంగా వ్యవహరిస్తామని, ప్రతి మండలంలో ప్రత్యేక అధికారి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ రైతులకు ఎప్పటి కప్పుడు సమస్య పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా మొదటి దశలో 5790 మంది రైతులకు చెందిన 6910 ఎకరాల విస్తీర్ణంలో ప్రతి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మొత్తం 6 కోట్ల 91 లక్షలు నష్టపరిహారం మంజూరు చేశామని అన్నారు. రెండవ దఫా భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన నష్టానికి ప్రభుత్వం నివేదిక పంపామని, త్వరలో వారికి సైతం ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తోట వెంకటేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జిల్లా సహకార అధికారి మైఖేల్ బోస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *