నిరుప‌యోగ‌మైన‌వి ఇచ్చేద్దాం.. ఆర్ఆర్ఆర్ ను ఆద‌రిద్దాం..

నిరుప‌యోగ‌మైన‌వి ఇచ్చేద్దాం..
ఆర్ఆర్ఆర్ ను ఆద‌రిద్దాం…

  • ఆర్ఆర్ఆర్ (రెడ్యూస్‌,రీ యూజ్‌, రీ సైకిల్) కు శ్రీకారం చుట్టిన పీర్జాది గూడ
  • స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్, అర్భ‌న్ 2.0లో భాగంగా 26 వార్డుల‌లో..
  • పీర్జాదిగూడ కార్పోరేష‌న్ మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్ రెడ్డి పిల్లలు..

పీర్జాదిగూడ, మే 20 (విశ్వం న్యూస్) : మేరీ లైఫ్.. మేరా స్వ‌చ్ఛ ష‌హార్.. నినాదంతో రెడ్యూస్‌, రీ యూజ్‌, రీ సైకిల్ (ఆర్‌ఆర్‌ఆర్‌) పేరుతో పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. కార్పోరేష‌న్ ప‌రిధిలోని ప్ర‌జ‌ల వ‌ద్ద‌, ఇండ్ల‌లో నిరుప‌యోగంగా ఉన్న వ‌స్తువుల‌ను సేక‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ – అర్భ‌న్ 2.0లో భాగంగా కార్పోరేష‌న్ ప‌రిధిలోని 26 వార్డుల‌లో శ‌నివారం నాడు ఆర్ఆర్‌ఆర్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీర్జాదిగూడ కార్పోరేష‌న్ క‌మిష‌న‌ర్ వంశీకృష్ణ ఇత‌ర అధికారుల‌తో క‌లిసి ఏవీ ఇన్ఫో ఫ్రైడ్‌లో ఆర్‌.ఆర్‌.ఆర్ సెంట‌ర్‌ను ప్రారంభించిన మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్ రెడ్డి.

రెడ్యూస్‌, రీయూజ్‌,
రీసైకిల్ పై మేయర్ జివీఆర్ ఉద్దేశం..
రెడ్యూస్ అంటే చెత్తకుప్పల్లోకి చేరే వ్యర్థాలను తగ్గించుకోవడం. మ‌నం వినియోగిస్తున్న వాటిలో దేన్నైనా అవసరం ఉన్నంత వ‌రకే వాడుకోవడం. త‌ద్వారా ఆర్ధికంగా లాభం చేకూరడంతో పాటు భూమిని కాపాడ‌టంలో మనవంతు సాయం అందించిన‌ట్లవుతుంది. భూమ్మీద ఉన్న వారందరూ రాబోవు ప్రమాదాన్ని పూర్తిగా నివారించక‌పోయినా, దాని తీవ్రతను తగ్గించ‌వచ్చు.

చెత్త తగ్గాలంటే వాడి పారేసే వస్తువుల కంటే, మళ్లీమళ్లీ వాడుకోగల వాటికే ప్రాధాన్యమివ్వాలి. ఉదాహ‌ర‌ణ‌కు మంది కొనుగోలు చేసిన బ‌ట్ట‌లు, వాహానాలను కొద్ది రోజుల వాడి ప‌క్క‌న ప‌డేస్తారు. కానీ ఇవి అవ‌స‌రం ఉన్న‌వాళ్లు ఈ స‌మాజంలో చాలా మంది ఉన్నారు. అలాగే ఇంట్లో మిగిలిన అన్నం ప‌డేస్తారు. కానీ ఆ అన్నం బయ‌ట చాలా మంది ఆక‌లి తీరుస్తుంది. పిల్ల‌ల చ‌ద‌వుల కోసం పుస్త‌కాల‌ను కొనుగోలు చేస్తారు. ఆ సంవ‌త్స‌రం పూర్త‌వ‌గానే ఓ మూల‌న ప‌డేయ‌డం, లేదా అమ్మేయ‌డం చేస్తారు.

కానీ వీటిని పుస్త‌కాలు కొనుగోలు చేయ‌లేని వారికి అందిస్తే పేదింటి పిల్ల‌లు పెద్ద చ‌దువులు త‌క్కువ ఖ‌ర్చుల‌తో చ‌ద‌వ‌డంలో ప‌రోక్షంగా మ‌నం స‌హాకారం అందించిన‌ట్లు అవుతుంది. వాడేసిన వస్తువుల రూపం, తీరుతెన్నులను రీ సైక్లింగ్ ద్వారా మార్చి మ‌రో అవసరానికి వాడుకోవడం వ‌ల‌న వ్య‌ర్థానికి కొత్త అర్థం చెప్పిన‌ట్లు అవుతుంది. ముఖ్యంగా మ‌నుషుల రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగమనేది విడదీయలేని భాగమై పోయింది. దేశంలో ప్రతి నిమిషం దాదాపు 12-15 లక్షల ప్లాస్టిక్ బ్యాగులను వినియోగిస్తున్నారంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

తక్కువ ఖర్చుతో పాటు సులభంగా అన్ని అవసరాలకు ఉపయోగపడుతుండ‌టంతో వాటిపై ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆధారప‌న‌డుతున్నారు. కానీ ప్లాస్టిక్ క‌వ‌ర్లు, ప్లాస్టిక్ వ‌స్తువుల వాడ‌కం వ‌ల‌న ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యంతో పాటు భూమిపై నున్న జీవ‌రాశుల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంది. ఇప్పటికే యాభై మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న కవర్లు, వస్తువుల వినియోగంపై నిషేధం అమ‌ల్లో ఉంది. కానీ ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం, స‌హాకారం లేని కార‌ణంగా పూర్తిస్థాయిలో అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. వాడేసిన ప్లాస్టిక్ ను రీ సైకిల్ చేయ‌డం వ‌ల‌న‌ కొత్త‌ ఉత్ప‌త్తి త‌గ్గుతుంది. చెడిపోయిన ఆహార ప‌దార్థాల నుంచి సేంద్రీయ ఎరువును త‌యారికి ఉప‌యోగించాలి. ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను, ఇనుమును, త‌దిత‌ర వాటిని రీసైకిల్ చేయ‌డం వ‌ల‌న ఏదోఒక రూపంలో వాటిని మ‌ళ్లీ వినియోగంలోకి తీసుకువ‌చ్చేందుకు రీ సైకిల్ అనివార్యం.

రీసైకిల్ వ‌ల‌న కాలుష్యం త‌గ్గుతుంది
మ‌నం వాడిన వాటిలో ఎక్కువ వ‌స్తువుల‌ను రీసైకిల్ చేయ‌వ‌చ్చును. ముఖ్యంగా ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేనైన్నా రీసైకిల్ చేసి వాటిని మ‌రో అవ‌స‌రానికి వినియోగించ‌వ‌చ్చును. కొన్ని రకాల ప్లాస్టిక్ పదార్ధాలు నశించిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్, ప్రత్యామ్నాయాల కోసం విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్ విభాగంలో ఈ-వేస్ట్, యూఎస్ఏ డ్రైవ్లు, స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉన్నాయి. ప్లాస్టిక్, ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్థాలను రీసైకిల్ చేయడం వల్ల గాలి, నేల, నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

పీర్జాదిగూడ కార్పోరేష‌న్ ప‌రిధిలో 26 సెటంర్లు ఏర్పాటు
స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ – అర్భ‌న్ 2.0లో భాగంగా కార్పోరేష‌న్ ప‌రిధిలోని 26 వార్డుల‌లో స్థానిక కార్పోరేటర్ల‌, కాల‌నీ వాసుల స‌హ‌కారంతో క‌లిసి రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్ (ఆర్.ఆర్‌.ఆర్‌) వ‌స్తువుల సేక‌ర‌క‌ణ కేంద్రాల ఏర్పాటు చేశాం. సుమారు 15 రోజుల పాటు ఈ కేంద్రాలు కొన‌సాగుతాయి. ప్ర‌జ‌లు సామాజిక బాధ్య‌త‌గా గుర్తించి, ప్ర‌తి పౌరుడు ఆర్.ఆర్‌.ఆర్‌ను ఆద‌రించ‌డంతో పాటు ఇందులో భాగ‌స్వామ్యం కావాలి. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో భ‌విష్య‌త్తు త‌రాల‌కు మంచి ప‌ర్యావ‌ర‌ణం అందించాల‌నే సంక‌ల్పంతో పీర్జాదిగూడ‌లో ఆర్‌.ఆర్‌.ఆర్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఇందులో రీ యూజ్ చేసే ప‌రిక‌రాల కోసం కార్పోరేష‌న్ ప‌రిధిలో అవుట్‌ లెట్ కూడా ఏర్పాటు చేస్తాం. అవ‌స‌రం ఉన్న వాళ్ల‌కు ఉచితంగానే వాటిని అందించ‌డం జ‌రుగుతుందని మేయర్ జక్క వెంకట్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *