కంటి వెలుగు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి, జనవరి 19 (విశ్వం న్యూస్) : జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామం , కమాన్ పూర్ మండల హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కమాన్పూర్ మండల హెడ్ క్వార్టర్ లోని గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రణాళిక బద్ధంగా ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి కళ్లద్దాలను పంపిణీ చేయాలని, ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు అవసరమైన వివరాలు యాప్ లో నమోదు చేసి ఇంటి వద్దకు కళ్లద్దాలు వస్తాయని వారికి చెప్పి పంపాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి వెలుగు క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, శని, ఆదివారాలు, పండుగలు, ప్రభుత్వ సెలవులలో క్యాంపులు నిర్వహణ ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు. కమాన్ పూర్ మండల హెడ్ క్వార్టర్ లో ఉన్న 8289 మంది జనాభా కోసం జనవరి 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు 27 రోజుల పాటు కంటి వెలుగు క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, గ్రామంలో ప్రతిరోజు ఏ ప్రాంతం వారు క్యాంపుకు హాజరు కావాలో ప్రణాళిక తయారు చేసుకోవాలని, ప్రజలకు అందించే ఆహ్వాన పత్రికలో సదరు వివరాలు తెలియజేయాలని, ప్రజలు అధికారులు సూచించిన సమయంలో వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. కంటి వెలుగు శిబిరం వద్ద కంటి పరీక్షలు జరుగుతున్న తీరును కలెక్టర్ పర్యవేక్షించారు.
పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామంలో ఉన్న 4406 మంది జనాభాకు పరీక్షలు నిర్వహించేందుకు జనవరి 19 నుంచి ఫిబ్రవరి 8 వరకు 14 రోజుల పాటు కంటి వెలుగు క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ ప్రజలు షెడ్యూల్ ప్రకారం శిబిరాలకు హాజరై ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు .
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కమాన్పూర్ మండల ప్రత్యేక అధికారి డి.డబ్ల్యూ.ఓ. రౌఫ్ ఖాన్, ఎంపీడీవో విజయ్ కుమార్, తహసిల్దార్ దత్తు ప్రసాద్, పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి మైకెల్ బోస్, ఎంపీడీవో రాజు, ఎంపీఓ సుదర్శన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.