జైశ్రీరామ్.. జై జై శ్రీరామ్!

- హోరెత్తిన కాజీపేట పట్టణం
- కన్నుల పండువగా కళ్యాణోత్సవం
- భక్తులతో కిటకిటలాడిన దేవాలయ ప్రాంగణాలు
- కాజీపేటలో ప్రారంభమైన విజయ యాత్ర
కాజీపేట, ఎప్రిల్ 6 (విశ్వం న్యూస్): జైశ్రీరామ్.. జై జై శ్రీరామ్.. అనే నినాదాలతో కాజీపేట పట్టణం హోరెత్తింది. కాజీపేట పట్టణంలో శ్రీరామ నవమి పర్వదిన వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. కాజీపేట లోని డీజిల్ కాలనీలో గల రామాలయం, , రైల్వే దేవాలయ సముదాయంలో గల రామాలయం, జూబ్లీ మార్కెట్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో, విష్ణుపురిలోని శ్వేతార్క ఆలయంలో, ప్రశాంత్ నగర్ లోని రామాలయంలో, చైతన్యపురిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఫాతిమా నగర్ లోని రామాలయంలో, పలు ప్రాంతాల్లోనీ ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కనుల పండువగ నిర్వహించిన ఈ సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు తన్మయత్వానికి గురైనారు. ఈ వేడుకల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కార్పోరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, నాయకులు ఎండి అంకుష్, టిఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్వేతార్కాలయంలో..
శ్వేతార్కాలయంలో వేద పండితులు అయినవోలు రాధాకృష్ణ శర్మ, సాయి కృష్ణ శర్మల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రమా రవీందర్ యాదవ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది.

హిందూ విజయ యాత్ర.. భారీ ర్యాలీ
కాజీపేటలోని కడిపికొండ బ్రిడ్జి వద్ద నుంచి ఆదివారం సాయంత్రం హిందూ విజయాత్ర ప్రారంభమైంది. ఈ విజయయాత్ర సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఒక ప్రత్యేక వాహనంపై శ్రీరాముడి ప్రతిమను ఊరేగిస్తూ కాజీపేట చౌరస్తా, రహమత్ నగర్ చౌరస్తా, ఫాతిమా నగర్ బ్రిడ్జి, సిద్ధార్థనగర్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీకి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. కాషాయ జెండాలతో కొనసాగిన ఈ యాత్రలో యువకులు హల్చల్ చేశారు. ఒక బాలుడు శ్రీరాముడి వేషాధారణలో అలరించాడు.
యాత్ర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ యాత్ర కన్వీనర్ నాగపురి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సనాతన భారతీయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీకృష్ణ శరణానంద భారతి, విగ్రహధాత డాక్టర్ తరుణ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగం, బిజెపి నాయకులు కాయిత రాజకుమార్ యాదవ్, 62వ డివిజన్ బిజెపి అధ్యక్షులు మేకల శ్రావణ్ యాదవ్, నాయకులు రానా యాదవ్, రాజు, సాయి, పలువురు నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.