బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
మాగంటి గోపీనాథ్ కన్నుమూత

హైదరాబాద్, జూన్ 8 (విశ్వం న్యూస్) : బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటినుండి చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం మరణించారు.

ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓ కార్పొరేటర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గోపీనాథ్, తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృతితో పార్టీకి, సమాజానికి తీరని లోటు ఏర్పడిందని నేతలు భావిస్తున్నారు.

- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.గోపీనాథ్ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని తెలిసిన వెంటనే కేటీఆర్ గారితో కలిసి ఎంపీ రవిచంద్ర ఏఐజీ ఆస్పత్రి చేరుకున్నారు.గోపీనాథ్ భౌతికకాయాన్ని కేటీఆర్,మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు,ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులు సందర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు,ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.