విజయఢంకా మోగించిన నవీన్ యాదవ్

- జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
హైదరాబాద్, నవంబర్ 14 (విశ్వం న్యూస్): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25 వేలకు పైగా మెజార్టీతో గెలుపొంది విజయఢంకా మోగించారు. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై ఎలాంటి వ్యతిరేకత లేదని, ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని ఆయన తెలిపారు.
- కాంగ్రెస్ – 98,988(50.83%)
- బీఆర్ఎస్ – 74,259(38.13%)
- బీజేపీ – 17,061(8.76%)
- 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
మరోవైపు మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నవీన్ యాదవ్ గెలుపును ముందే ఖాయం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. “మెజార్టీ ఎంత వస్తుందో మాత్రమే ఎదురు చూశాం. కాంగ్రెస్‌కు ప్రజల నుంచి స్పష్టమైన మద్దతు ఉంది” అని వారు పేర్కొన్నారు.గతంలో రెండుసార్లు ఓటమి ఎదురైనప్పటికీ నవీన్ యాదవ్ ప్రజల్లోనే ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, అవసరమైనపుడు అండగా నిలిచారని మంత్రులు గుర్తు చేశారు. అందుకే ఈసారి ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ చేసిన ఆరోపణలను తిరస్కరించి కాంగ్రెస్‌ను గెలిపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంతో కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహం నెలకొంది. ప్రజల ఆశీర్వాదంతో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం పార్టీకి మరింత బలం చేకూర్చిందని నాయకులు భావిస్తున్నారు.