అభివృద్ధిని అడ్డుకునే వారిని
గెలిపించవద్దు: సీఎం

వనపర్తి, నారాయణపేట, డిసెంబర్ 1 (విశ్వం న్యూస్) : వనపర్తి, నారాయణపేట జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సభల్లో ప్రసంగించారు. గ్రామాభివృద్ధి ప్రభుత్వంతో కలిసి పనిచేసే నాయకుల చేతిలోనే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవారిని స్థానిక సంస్థలలో గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించారు.

బీసీల జనాభాకు వందేళ్లుగా లెక్కలు లేవని, ఇప్పుడు సామాజిక కుల సర్వే ద్వారా అన్ని వివరాలు తీసుకున్నామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌పై భారీ అప్పుల ఆరోపణలు చేస్తూ, అప్పులు తీర్చుతూనే సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. పాలమూరు ప్రాంతం పదేళ్ల నిర్లక్ష్యానికి గురైందని రెవంత్ విమర్శించారు. ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలపై పెట్టిన కేసులు రైతులను నష్టపరిచాయని, అందుకే ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ప్రకటించామని చెప్పారు. ఎంత ఖర్చైనా మక్తల్–నారాయణపేట ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌ను ప్రాధాన్యంగా తీసుకున్నామని తెలిపారు. పాలమూరు జిల్లాకు ఐఐటీ, ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినట్టు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం వంటి కీలక అంశాలను సీఎం గుర్తు చేశారు.

మక్తల్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, 4 లైన్ రోడ్డు, క్రీడా భవనం నిర్మాణంతో పాటు వనపర్తిలో రూ.151.92 కోట్ల విలువైన పనులు, జూరాల దిగువన హై లెవెల్ బ్రిడ్జ్, ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు
