వరకట్న వేధింపుల కేసులో మామ హత్య – అల్లుడు, తల్లిదండ్రుల అరెస్ట్

మామ హత్య కేసులో
ముగ్గురు అరెస్ట్

మహబూబాబాద్, డిసెంబర్ 13 (విశ్వం న్యూస్) : వరకట్న వేధింపుల నేపథ్యంలో చోటుచేసుకున్న దారుణ ఘటనలో మామను కొట్టి చంపిన అల్లుడితో పాటు అతని తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ ఎన్ తిరుపతి రావు వెల్లడించారు.

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం బోజ్యతండాకు చెందిన బానోత్ లాలూనాయక్ మహబూబాబాద్ పాత కలెక్టర్ కార్యాలయ ప్రాంతంలోని బాలాజీ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురు శ్రీసాయిలహరిని కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్దతండాకు చెందిన గూగులోత్ గాంధీబాబుతో (ప్రస్తుతం మిలిటరీ కాలనీ, మహబూబాబాద్) వివాహం చేశారు.

వివాహం జరిగినప్పటి నుంచే అదనపు కట్నం, బంగారం తీసుకురావాలంటూ గాంధీబాబు తన తల్లిదండ్రులు, చెల్లితో కలిసి శ్రీసాయిలహరిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని పోలీసులు తెలిపారు. ఈ విషయమై బాధితురాలు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేయగా, పెద్దమనుషుల సమక్షంలో సర్దుబాటు చేసి ఆమెను తిరిగి అత్తింటికి పంపించారు. అయినప్పటికీ వేధింపులు కొనసాగడంతో పాటు కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు.

డిసెంబర్ 11న రాత్రి శ్రీసాయిలహరిపై మళ్లీ దాడికి యత్నించడంతో ఆమె వెంటనే తండ్రి లాలూనాయక్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో లాలూనాయక్ తన కుమారుడు ప్రదీప్‌తో కలిసి మిలిటరీ కాలనీలోని నిందితుల ఇంటికి వెళ్లారు. అక్కడ గాంధీబాబు, అతని తల్లిదండ్రులు ముగ్గురు కలిసి లాలూనాయక్, ప్రదీప్‌లపై మాకుమ్మడిగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన లాలూనాయక్ డిసెంబర్ 12న తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు.

ఈ ఘటనపై మృతుడి కుమారుడు ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ జి. మహేందర్ రెడ్డి కేసు నమోదు చేసి, 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వేగంగా దర్యాప్తు పూర్తి చేసిన టౌన్ సీఐ, టౌన్ ఎస్సై ఎస్‌కే షకీర్‌, సిబ్బందిని డీఎస్పీ తిరుపతి రావు అభినందించారు.

అరెస్ట్ అయిన నిందితులు: గూగులోత్ గాంధీబాబు (30) – సీతారాం కుమారుడు, గూగులోత్ సీతారాం (56) – రాంచంద్రు కుమారుడు, గూగులోత్ కవిత (50) – సీతారాం భార్య
నివాసం: మిలిటరీ కాలనీ, మహబూబాబాద్
స్వస్థలం: పెద్దతండా, గుండ్రాతిమడుగు, కురవి మండలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *