ప్రజాపాలన పేరుతో రాజకీయ వేట.. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేతలపై సిట్ దాడి!

హైదరాబాద్, జనవరి 26, 2026 (విశ్వం న్యూస్): “ఇది ప్రజాపాలన కాదు… రాక్షస పాలన” అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డ వేళ, ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా మరింత వేడెక్కింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ అధికారులు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న కేటీఆర్‌ను దాదాపు ఏడు గంటలపాటు సిట్ ప్రశ్నించింది. అంతకు ముందు జనవరి 20న హరీశ్‌రావును కూడా సుమారు ఏడు గంటలపాటు విచారించారు. మూడు రోజుల విరామం అనంతరం తాజాగా సంతోష్ కుమార్‌కు నోటీసులు జారీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ సిట్‌లో మొత్తం తొమ్మిది మంది అధికారులు ఉన్నారు. వరుస విచారణలు, నోటీసులతో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తీసుకుంటుందా అన్న చర్చ జోరుగా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *