ప్రజాపాలన కాదు
రాక్షస పాలన:కేటీఆర్

హైదరాబాద్, జనవరి 26, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపొందించిన ‘అనుముల రాజ్యాంగం’ అమలవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కాదని, రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న రాక్షస పాలనగా మారిందని దుయ్యబట్టారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక నాటిక ప్రదర్శనలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలను ఎండగడుతూ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పేలా నిర్వహించిన ఈ నాటిక ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని అభినందించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రతిసారీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. “బోధించు, సమీకరించు, పోరాడు” అనే అంబేద్కర్ తత్వాన్ని కేసీఆర్ సమర్థవంతంగా అమలు చేసి తెలంగాణను సాధించడమే కాక అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కొనియాడారు.
అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3 వల్లనే ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమైందని, అదే ఆలోచనతోనే అల్పసంఖ్యాక వర్గాలకు న్యాయం జరుగుతోందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పోటీ పడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తి సరైనోడు కాకపోతే ప్రయోజనం శూన్యమని అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. అదే పరిస్థితి నేడు కేంద్రం, రాష్ట్రాల్లో కనిపిస్తోందన్నారు.
రాహుల్ గాంధీ తుక్కుగూడలో ప్రకటించిన న్యాయ పత్రం అన్యాయ పత్రంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం చేస్తామని చెప్పిన రాహుల్ గాంధీ వెనకే ఫిరాయింపుదారులు ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో జర్నలిస్టులను కూడా ఉగ్రవాదుల్లా అరెస్టు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కోదాడలో జరిగిన కర్ర రాజేష్ లాకప్ డెత్‌కు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాజేష్ దళితుడు కావడమే కాంగ్రెస్ పాలనలో అతని చేసిన పాపమైందని వ్యాఖ్యానించారు. దళితుడు అధ్యక్షుడిగా ఉన్నామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పాలనలో దళితుడి లాకప్ డెత్‌పై సీఎం రేవంత్ రెడ్డి గానీ, స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ స్పందించలేదని విమర్శించారు.
‘జెండా గద్దెలు కూల్చండి’ అంటూ సీఎం ప్రజలను రెచ్చగొడుతూ శాంతిభద్రతలను, రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని రేవంత్ రెడ్డి లాక్కొనే ప్రయత్నం చేయడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా స్పందించి ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు చేసిందని, రూ.10 వేల కోట్ల భూమి కుంభకోణం జరిగిందని కమిటీ పేర్కొన్నా ఇప్పటికీ కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.