కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా

జగిత్యాల, మార్చి 25 (విశ్వం న్యూస్): : కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ముగింపు పలికారు. జగిత్యాలలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జీవన్‌రెడ్డి చివరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీతో 40 సంవత్సరాల అనుబంధం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పార్టీలో ఇమడే పరిస్థితి లేదని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జీవన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీతో ఎంతోకాలం కలిసి పనిచేసినా, ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల్లో విధిలేని పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నానని అన్నారు.

ఆయన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించినప్పటికీ జీవన్‌రెడ్డి మాత్రం తన నిర్ణయంపై నిలబడ్డారు. ఎంతమంది నాయకులు బుజ్జగించినా తాను వెనక్కి తగ్గే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
జగిత్యాల సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు కూడా ఆయన నిర్ణయంతో భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ పార్టీ కోసం నాలుగు దశాబ్దాలుగా పనిచేసిన తన రాజకీయ ప్రయాణానికి ఇక్కడితో ముగింపు పలుకుతున్నానని జీవన్‌రెడ్డి తెలిపారు.
ఇకపై తన రాజకీయ భవిష్యత్‌పై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని ఆయన సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం మరిన్ని చర్చలకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.