రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ను గద్దె దింపాలి

హైదరాబాద్, మే 27 : తెలంగాణలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతోందని, రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రైతు ప్రభుత్వాన్ని కోల్పోయి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం వల్ల నేడు తెలంగాణ రైతాంగం పశ్చాత్తాపపడుతోందని విమర్శించారు. రైతుబంధువు బాపు కేసీఆర్‌ను గద్దె దించడం పెద్ద అవివేకమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

బాపు కేసీఆర్ పాలనలో సాగునీటి రంగం అపూర్వ అభివృద్ధి సాధించిందని, భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు పెట్టుబడి సాయం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం వల్ల తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే ముందంజలో నిలిచిందన్నారు. పంట కొనుగోళ్లు సజావుగా జరిగేవని, రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమయ్యేవని గుర్తుచేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతు బతుకు దయనీయంగా మారిందని ఆరోపించారు. 24 గంటల ఉచిత కరెంటు అమలు లేకుండా పోయిందని, విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులతో రైతులు మోసపోతున్నారని, రైతుబంధు నిలిచిపోయిందని విమర్శించారు. రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేదని, మార్కెట్ యార్డుల్లో ధాన్యం రాశుల వద్ద రైతులు నిద్రాహారాలు మాని కాపలా కాస్తున్నారని పేర్కొన్నారు.
అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీనికి తోడు తెలంగాణకు దక్కాల్సిన సాగునీటిని ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చంద్రబాబు అంగీకరించాలనడం పెద్ద ద్రోహమని, గోదావరి-కావేరి అనుసంధానం పేరుతో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడలేని, రైతులు పండించిన పంటను కొనలేని, రైతులకు పెట్టుబడి సాయం అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతులకు అండగా బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాలకు వెళ్లాలని, రైతు వ్యతిరేకి మరియు తెలంగాణ వ్యతిరేకి అయిన రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
