మహిళపై దాడి.. చైన్ స్నాచింగ్ యత్నం భగ్నం

హైదరాబాద్, మే 26 (విశ్వం న్యూస్): నగరంలోని కొంపల్లి జయభేరి కాలనీలో ఓ మహిళపై దుండగుడు దారుణంగా దాడి చేసి చైన్ స్నాచింగ్‌కు యత్నించిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు, కాలనీలో ఆయిల్ షాప్ నిర్వహిస్తున్న మహిళపై ఓ వ్యక్తి అకస్మాత్తుగా దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొనే ప్రయత్నం చేశాడు.
దుండగుడి దాడితో భయాందోళనకు గురైన మహిళ గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి అతడిని అప్పగించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.