అప్పుల వేధింపులతో కుటుంబ విషాదం

- హోమ్ లోన్ బాధలు తాళలేక భార్య, పిల్లలను చంపి వ్యక్తి ఆత్మహత్య
వనపర్తి , మే 27 (విశ్వం న్యూస్): వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సాల్కలాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన ఓకే కుటుంబముకు చెందిన నలుగురు బుధవారం రాత్రి మృతి చెందారు. అప్పుల బాధలు కుటుంబాన్ని విషాదంలోకి నెట్టాయి. హోమ్ లోన్ వేధింపులు, అప్పులు ఇచ్చిన వారి మానసిక ఒత్తిళ్లు భరించలేక ఓ వ్యక్తి భార్య, పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చనిపోయే ముందు బాధితుడు సెల్ఫీ వీడియో విడుదల చేయగా, అందులో తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
“హోమ్ లోన్స్ బాధ భరించలేకపోతున్నాను.. అప్పులు ఇచ్చిన వారు మానసికంగా వేధిస్తున్నారు.. అప్పులు తీర్చేందుకు కొంత సమయం కావాలని లాయర్‌ను ఆశ్రయిస్తే, ఐపీ పెట్టడానికి వెళ్లాడంటూ నన్ను అవమానిస్తున్నారు. నాకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదు” అంటూ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు.
తన భార్య, పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని పేర్కొంటూ, “మామిడి తోట శ్రీనివాసరావు, సాయి సార్, గణేష్ సార్.. నేను మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయలేదు” అని పేర్కొన్నాడు. హోమ్ లోన్ సంస్థల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “అప్పు ఉన్నాడంటూ ఇంటి గోడపై రాయించి ఇంటిని సీజ్ చేశారు.. ఇంట్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లారు.. అప్పులు తీసుకున్న వారి పరిస్థితిని అర్థం చేసుకోండి” అని వీడియోలో విజ్ఞప్తి చేశాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్ఫీ వీడియో ఆధారంగా వేధింపుల కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.