ధాన్యం కొనుగోళ్లలో
కాంగ్రెస్ సర్కార్ విఫలం

తిమ్మాపూర్,, మే 30 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులకే స్పష్టత లేదని, గందరగోళ లెక్కలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన బీజేపీ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ధాన్యం కొనుగోలు, రవాణా, గన్నీ సంచులు, ఇతర సౌకర్యాలకు అవసరమైన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే “రైతు గోస – బీజేపీ భరోసా” యాత్ర చేపట్టామని తెలిపారు.
అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం స్పందించలేదని, ధాన్యం సేకరణపై ప్రభుత్వానికి సరైన గణాంకాలే లేవని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా కొనుగోలు చేయాలని, అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ధాన్యం కొనుగోళ్ల సమస్యలను పక్కనబెట్టి ఎరువుల అంశంపై ముందుగానే వ్యాఖ్యలు చేయడం సరికాదని రామచందర్ రావు అన్నారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రైతులకు ఎరువులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బోడిగే శోభ తదితరులు పాల్గొన్నారు.