
మేడ్చల్ , జూన్ 21 (విశ్వం న్యూస్) : మేడ్చల్ జిల్లా కీసరలో తల్లి అనే పదానికే మచ్చతెచ్చే ఘోర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో ఏకాంతంగా గడపడానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ తన రెండేళ్ల కుమారుడిని కిరాతకంగా హత్య చేసింది. అనంతరం బాలుడు ఫిట్స్ వచ్చి మృతి చెందాడంటూ భర్తను, కుటుంబ సభ్యులను నమ్మించి అంత్యక్రియలు కూడా నిర్వహించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన జ్యోతి, స్వామి దంపతులు ఉపాధి నిమిత్తం కీసరలో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. జ్యోతికి పెళ్లికి ముందే నవీన్ అనే యువకుడితో పరిచయం ఉండగా, వివాహం తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగింది.
మే 29న భర్త విధులకు వెళ్లిన సమయంలో ప్రియుడు నవీన్ ఇంటికి వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బాలుడు ఏడవడంతో, తమ సరదాకు భంగం కలిగిస్తున్నాడంటూ నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాలుడిని చంపేయాలని సూచించడంతో, జ్యోతి చిన్నారిని నేలకేసి కొట్టింది. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
తర్వాత భర్త ఇంటికి రాగానే బాలుడికి ఫిట్స్ వచ్చి చనిపోయాడని జ్యోతి చెప్పడంతో కుటుంబ సభ్యులు నమ్మారు. అయితే ఘటన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పులు గమనించిన స్వామికి అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశ్నించగా, తానే కుమారుడిని హత్య చేసినట్లు జ్యోతి ఒప్పుకుంది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు. నిందితురాలు జ్యోతిని అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న నవీన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.