
హైదరాబాద్, జూలై 4 (విశ్వం న్యూస్): కవిత ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీకి తొలి అడుగులోనే ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. “టీఆర్ఎస్” అనే పేరు ప్రజల్లో ఇప్పటికే బలమైన రాజకీయ గుర్తింపు పొందిందని, అదే పేరును కొత్త పార్టీకి అనుమతించడం గందరగోళానికి దారితీస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజల నుంచి అనేక అభ్యంతరాలు రావడంతో ఆ పేరును కొనసాగించడం సాధ్యం కాదని కవితకు లేఖ ద్వారా తెలిపింది.
అంతేకాదు, 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని, లేకపోతే ఎలాంటి తదుపరి సమాచారం ఇవ్వకుండా పార్టీ నమోదు దరఖాస్తును మూసివేస్తామని సీఈసీ హెచ్చరించింది. దీంతో పార్టీ ప్రారంభానికి ముందే పేరు వివాదం కవితకు చిక్కుగా మారింది.
ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన టీఆర్ఎస్ పేరును మళ్లీ వినియోగించే ప్రయత్నానికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. ఇప్పుడు కవిత కొత్త పేరుతో ముందుకు వస్తారా? లేక ఈ నిర్ణయంపై న్యాయపోరాటానికి దిగుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో మాత్రం “పేరు మారినా రాజకీయ లక్ష్యం మారదు.. కానీ గుర్తింపు మాత్రం కొత్తగా సంపాదించుకోవాల్సిందే” అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.