నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలి

నిరుపేదలకు వెంటనే డబుల్
బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలి

హుజురాబాద్, జూలై 2 (విశ్వం న్యూస్): హుజురాబాద్ పట్టణంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే కేటాయించాలని హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా ఖబ్రస్తాన్ మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాకు విజ్ఞప్తి చేశారు.

గురువారం ఆయన మాట్లాడుతూ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం నిరుపేదలు సంవత్సరాల క్రితమే దరఖాస్తులు సమర్పించారని, ఇటీవల అధికారులు మరోసారి దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారని తెలిపారు. ఇల్లు, స్థలం లేని అర్హులను గుర్తించి జాబితా ఖరారు చేసినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఇళ్ల కేటాయింపు జరగకపోవడం బాధాకరమన్నారు.

దాదాపు 15 సంవత్సరాల క్రితమే నిర్మించిన ఈ ఇళ్లు ఖాళీగా ఉండటంతో తలుపులు, కిటికీలు వంటి సామగ్రి చోరీకి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నివారించేందుకు వెంటనే ఇళ్లకు సీరియల్ నంబర్లు కేటాయించి, ఎంపికైన లబ్ధిదారులకు పారదర్శకంగా పంపిణీ చేయాలని కోరారు.

ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాలు ప్రతిరోజూ కాలనీల వద్దకు వెళ్లి కేటాయింపులపై ఆరా తీస్తున్నాయని తెలిపారు. కిరాయి ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన కేటాయింపులు పూర్తి చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వి. ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ రెంటాల సుహాసిని కూడా ఈ విషయంపై స్పందించి నిరుపేదలకు న్యాయం చేయాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *