పెంజర్లలో మృతదేహం.. పక్కనే విషం సీసా లభ్యం

రంగారెడ్డి, జూలై 13 (విశ్వం న్యూస్):రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన నరహంతకుడు రాజ్‌కుమార్ (29) మృతదేహం సోమవారం కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలోని ఓ వెంచర్లో లభ్యమైంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని రాజ్‌కుమార్‌దిగా గుర్తించారు. మృతదేహం పక్కనే విషం సీసా లభ్యమవడంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.
పోక్సో కేసుతో పెరిగిన కక్ష: షాబాద్‌లో నివసించే ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో రాజ్‌కుమార్ వేధించేవాడు. బాలిక తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని వేధింపులు ఆగలేదు. ఈ ఏడాది మే 16న అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం ముందస్తు బెయిల్ పొందిన రాజ్‌కుమార్, తనపై కేసు పెట్టారని బాలిక కుటుంబంపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు.
బాలిక కుటుంబంపై రక్తపాతం : గత శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడిన రాజ్‌కుమార్.. బాలిక తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మలను కత్తితో హత్య చేశాడు. అనంతరం బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడు. వికలాంగురాలైన బాలిక అక్కను మాత్రం ప్రాణాలతో వదిలేశాడు.
సొంత కుటుంబాన్నీ కడతేర్చాడు:అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న రాజ్‌కుమార్ తన భార్యను, ఇద్దరు చిన్నారులను కూడా కత్తితో దారుణంగా హత్య చేశాడు. భార్య అడ్డుకోవడంతో ఆమెపై దాడి చేసి చంపి, అనంతరం ఇద్దరు కుమారులను కూడా హతమార్చాడు. మొత్తం ఆరుగురి ప్రాణాలు తీశాడు.
తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరారీ : హత్యల అనంతరం రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఆరుగురిని చంపినట్లు చెప్పాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని తెలిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని అతని తండ్రి పోలీసులకు తెలియజేయడంతో గాలింపు చేపట్టారు.
దర్యాప్తు కొనసాగుతోంది: సోమవారం పెంజర్లలో రాజ్‌కుమార్ మృతదేహం లభించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.