₹12,289 కోట్ల
రెవెన్యూ లోటు

హైదరాబాద్, జూలై 20 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కాగ్ (CAG) విడుదల చేసిన తొలి త్రైమాసిక (ఏప్రిల్–జూన్) ఆర్థిక నివేదికను ప్రస్తావిస్తూ సోమవారం ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
2026-27 బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, కేవలం మూడు నెలల్లోనే రాష్ట్రం ₹12,289 కోట్ల రెవెన్యూ లోటులోకి వెళ్లిందని పేర్కొన్నారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి అనుమతించిన నికర అప్పుల్లో 37.5 శాతం అప్పులను ఇప్పటికే ప్రభుత్వం వినియోగించిందని ఆరోపించారు.
జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, నాన్-టాక్స్ రెవెన్యూ, కేంద్ర గ్రాంట్లు వంటి ప్రధాన ఆదాయ వనరులలో ప్రభుత్వం లక్ష్యాలకు చాలా దూరంగా ఉందని దాసోజు తెలిపారు. రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు రద్దీగా కనిపిస్తున్నప్పటికీ ఎక్సైజ్ ఆదాయం తక్కువగా నమోదవడం అనుమానాలకు తావిస్తోందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా, రైతు బీమా, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ వంటి ఎన్నికల హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని కోరారు.
ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్” వంటి ప్రచారాలకు బదులుగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై దృష్టి సారించాలని దాసోజు శ్రవణ్ సూచించారు.